టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ నంబర్ వన్ కావాలనే ఆశ హిట్‌మ్యాన్‌కు లేదని.. ఎల్లప్పుడూ జట్టు కోసమే తాపత్రయపడేవాడని తెలిపాడు. రోహిత్ అద్భుత కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు వన్డే, టీ20లలో అగ్రస్థానానికి చేరుకుందని కొనియాడాడు.
కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. హిట్‌మ్యాన్ కేవలం బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు.
తొలిసారి అగ్రస్థానం
ఇక ఆసీస్ టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌లో 38 ఏళ్ల రోహిత్ 202 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని.. 781 పాయింట్లతో నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గగా నిలిచాడు.
అతిపెద్ద వయస్కుడిగా
తద్వారా సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఐదో భారతీయ క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఐసీసీ నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించాడు.
వరల్డ్ నంబర్ వన్ కావాలని కోరుకోలేదు
ఈ నేపథ్యంలో మొహమ్మద్ కైఫ్ రోహిత్ శర్మ జట్టుకు నిస్వార్థ సేవ చేశాడంటూ అతడి అంకితభావాన్ని ప్రశంసించాడు. ‘‘ఐసీసీ వన్డే నంబర్ వన్ ర్యాంకు నడుచుకుంటూ రోహిత్ దగ్గరకు వచ్చింది. తాను ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ కావాలని రోహిత్ ఎప్పుడూ అనుకోలేదు.
అలాంటి కోరిక ఒకటి మనసులో ఉందని ఎన్నడూ చెప్పనూ లేదు. తన ధ్యాస ఎల్లప్పుడూ జట్టు గురించే. టీమిండియా గెలవాలి.. టాప్‌లో ఉండాలి.. ఇదే తన ఆశయం. అతడు గొప్ప కెప్టెన్.
టీమిండియాను నంబర్ వన్‌గా నిలిపాడు
కీలక సమయాల్లో బ్యాట్‌తో రాణించడం తనకు అలవాటు. ఇక జట్టు విజయానికి కారణం ఎవరైనా వారిని తప్పక ప్రశంసిస్తాడు రోహిత్. టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నపుడు రోహిత్ కెప్టెన్సీ చేపట్టాడు.
జట్టును నంబర్ వన్‌గా నిలిపిన తర్వాత అతడు తప్పుకోవాల్సి వచ్చింది. ఇక టీ20లలో రెండో ర్యాంకులో ఉన్నపుడు పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఈ ఫార్మాట్లోనూ టీమిండియాను అగ్రస్థానంలో నిలిపి.. వరల్డ్‌కప్ (2024) అందించి కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు’’ అని కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్
ఇక ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... చాంపియన్స్ ట్రోఫీ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. కంగారూలతో చివరి మ్యాచ్‌లో అజేయ సెంచరీతో చెలరేగిన రోహిత్ భారత్ తరఫున అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.
కాగా 2019 వన్డే ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 5 శతకాలతో చెలరేగిన రోహిత్ శర్మ కెరీర్ అత్యుత్తమంగా 882 రేటింగ్ పాయింట్లు సాధించినా... రెండో ర్యాంక్‌లోనే నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతడికి తొలిసారి ‘టాప్’ ప్లేస్ దక్కింది.
చదవండి: ఓడిపోతే.. ఎలా ఉంటుందో తెలుసు.. గెలిచినా.. ఓడినా ఏడ్చేస్తా: భారత కెప్టెన్


