
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం ఆటంకం కలిగించిన కారణంగా 26 ఓవర్లకు ఈ మ్యాచ్‌ను కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేసింది.
డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్దేశించగా.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి కంగారూలు పనిపూర్తి చేశారు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది.
అదేంటో.. ఎవరికీ అర్థం కాదు
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీఎల్‌ఎస్ (Duckworth–Lewis–Stern method) పద్ధతి ద్వారా లక్ష్యాలు ఎలా నిర్దేశిస్తారో ఎవరికీ అర్థం కాదని వాపోయాడు. ‘‘ఈ మెథడ్ అందరికీ అర్థం అవుతుందని నేను అనుకోను. అయితే, సుదీర్ఘ కాలంగా ఈ పద్ధతినే వాడుతున్నారు.
ఇలా మ్యాచ్‌లకు వర్షాలు ఆటంకం కలిగించినపుడు.. గతంలో ఓ భారతీయుడు VJD (వి. జయదేవన్ మెథడ్)మెథడ్‌ను ప్రవేశపెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇదే ఉపయోగించేది. అయితే, ఇప్పుడు ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు.
ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా
ఏదేమైనా వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగినపుడు.. ఇరుజట్లకు సమన్యాయం జరిగేలా ఉండే పద్ధతులను వాడితే బాగుంటుంది. లక్ష్యం నిర్దేశించేందుకు ప్రామాణికం ఏమిటో వివరించాల్సి ఉంటుంది’’ అని సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
అదే విధంగా.. భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆసీస్‌తో తొలి వన్డేలో విఫలం కావడంపై కూడా గావస్కర్ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘టీమిండియా ఐదు నెలల క్రితమే చాంపియన్స్ ట్రోపీ గెలిచింది. జట్టు బాగుంది.
రో- కో ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదుపరి మ్యాచ్‌లలో భారీగా పరుగులు రాబట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాన్నాళ్ల తర్వాత వారు మైదానంలో అడుగుపెట్టారు. నెట్స్‌లో రిజర్వు బౌలర్ల త్రోడౌన్స్‌ను ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరు ఫామ్‌లోకి వస్తే టీమిండియా 300- 320 పరుగులు చేయగలదు’’ అని గావస్కర్ రో-కోకు మద్దతుగా నిలిచాడు.
కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసింది. ఇక గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య గురువారం జరిగే రెండో వన్డేకు అడిలైడ్ వేదిక.
చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’