సెహ్వాగ్, అశ్విన్‌ చురకలు | A fun war of words broke out between former players in the IPL | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్, అశ్విన్‌ చురకలు

Mar 30 2026 2:54 AM | Updated on Mar 30 2026 2:54 AM

A fun war of words broke out between former players in the IPL

బెంగళూరు: ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఆరంభ పోరు సందర్భంగా మాజీ ఆటగాళ్ల మధ్య సరదాగా మాటల యుద్ధం చోటుచేసుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యాఖ్యాతగా మారాడు. జియో హాట్‌స్టార్‌ హిందీ కామెంటరీ ప్యానల్‌లో అడుగు పెట్టాడు. 

ఈ సందర్భంగా అతడికి స్వాగతం పలికే క్రమంలో సెహ్వాగ్‌ ‘కొత్త కోడి వచ్చింది’ (నయీ ముర్గీ ఆయీ హై) అని సంబోధించాడు. అక్కడి దాకా సరదాగా అనిపించినా... ఆ తర్వాత సెహ్వాగ్‌ అన్న మాటలు వివాదానికి దారితీశాయి. ‘ఈ రోజు మనం మనసు విప్పి మాట్లాడదాం... ఆలోచించి కాదు’ అని సెహ్వాగ్‌ అన్నాడు. దీనికి అశ్విన్‌ బదులిస్తూ... ‘ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించి మాట్లాడమని మా తల్లిదండ్రులు నేర్పారు. మీరు దానికి విరుద్ధంగా చెబుతున్నారు’ అని చురకంటించాడు. 

సెహ్వాగ్‌ అక్కడితో వదిలేయకుండా... ‘కొంతమంది ఫాలోవర్స్‌ తగ్గిపోతారనే భయంతో ఆచితూచి మాట్లాడుతుంటారు. ఫ్యాన్స్‌ ఏమనుకుంటారో అని ఆలోచించి కామెంట్స్‌ చేస్తారు’ అని అశ్విన్‌ సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి అన్నాడు. కాగా... దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మ్యాచ్‌ విశ్లేషణ పక్కనపెట్టి ఈ ఇద్దరూ వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అశ్విన్‌ ప్రదర్శనపై కూడా సెహ్వాగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘వికెట్లు తీయకుండా కేవలం పరుగులు నియంత్రించాలని చూసే బౌలర్‌ వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదు. ఆశ్విన్‌ ఇలాగే చేస్తే అతడిని తదుపరి సీజన్‌లో ఎవరూ తీసుకోరు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement