బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు.
శివరామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే.
నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు.
2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.
Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.
— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026


