
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) ఫైనల్‌కు చేరిన సౌత్ జోన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించిన సెంచరీ వీరుడు నారాయణ్ జగదీశన్ (N Jagadeesan) జట్టుకు దూరమయ్యాడు.
అదే విధంగా.. దేవ్‌దత్ పడిక్కల్ కూడా అందుబాటులో ఉండటం లేదు. వీరిద్దరు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్- ‘ఎ’ తరఫున ఆడబోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబరు 16 నుంచి ప్రారంభం కానుంది.
సౌత్ జోన్ వర్సెస్ సెంట్రల్ జోన్
మరోవైపు.. దులిప్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సెప్టెంబరు 11- 15 వరకు షెడ్యూల్ ఖరారైంది. సౌత్ జోన్- సెంట్రల్ జోన్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నారాయణ్ జగదీశన్, దేవ్‌దత్ పడిక్కల్ స్థానాల్లో ఆండ్రీ సిద్దార్థ్ (తమిళనాడు), స్మరణ్ రవిచంద్రన్ (కర్ణాటక) సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యారు. అజయ్ రోహెరా, అనికేత్ రెడ్డి స్టాండ్ బై ప్లేయర్లుగా చోటు దక్కించుకున్నారు.
ఫైనల్‌కు సౌత్ జోన్ జట్టు (అప్‌డేటెడ్)
అజారుద్దీన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రికీ భుయ్ (వైస్-కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, కాలే ఎమ్, షేక్ రషీద్, తన్మయ్ అగర్వాల్, సల్మాన్ నిజార్, ఆండ్రీ సిద్దార్థ్, తనయ్ త్యాగరాజన్, గుర్జాబ్‌నీత్ సింగ్, నిధీష్, కౌశిక్ వి, అనికేత్, టి. విజయ్, బాసిల్ ఎన్‌పీ.
స్టాండ్ బై ప్లేయర్లు: మోహిత్ రెడ్కర్ (గోవా), స్నేహల్ కౌతంకర్ (గోవా), ఈడెన్ యాపిల్ టామ్ (కేరళ), అజయ్ రోహెరా (పాండిచ్చేరి), జి. అనికేత్ రెడ్డి (హైదరాబాద్).
వెస్ట్‌జోన్‌కు నిరాశే
ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్‌లాంటి భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన వెస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీలో సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సెంట్రల్ జోన్‌తో మ్యాచ్ ‘డ్రా’ కాగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో దేశవాళీ ఆటగాళ్లతో కూడిన సెంట్రల్ జోన్ ముందంజ వేసింది. మరో సెమీఫైనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, రికీ భుయ్‌లు బాధ్యతగా ఆడటంతో సౌత్‌జోన్ కూడా దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
నార్త్‌జోన్‌తో సౌత్ సెమీస్ పోరు కూడా ‘డ్రా’గానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అంతిమ పోరుకు అర్హత సంపాదించిన సౌత్‌జోన్... ఈ నెల 11 నుంచి ఇదే వేదికపై జరిగే టైటిల్ పోరులో సెంట్రల్ జోన్‌తో తలపడుతుంది. విజేతను తేల్చనున్న ఫైనల్ మ్యాచ్ సంప్రదాయ టెస్టులాగా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.
సెంట్రల్ 600 ఆలౌట్
వెస్ట్‌జోన్‌తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఆఖరి రోజు సారాంశ్ జైన్ (108 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ కొట్టాడు. దీంతో క్రీజులోకి దిగిన 11 మందిలో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్ధశతకం పైచిలుకు పరుగులు చేయడం విశేషం. దీంతో నాలుగో రోజు 556/8 ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సెంట్రల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 164.3 ఓవర్లలో 600 పరుగుల వద్ద ఆలౌటైంది.
టెయిలెండర్లు సారాంశ్, యశ్ ఠాకూర్‌లపై కూడా వెస్ట్ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. దీంతో వీరిద్దరు అవలీలగా పరుగులు సాధించారు. ఈ క్రమంలో సారాంశ్ జైన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొమ్మిదో వికెట్‌కు 42 పరుగులు జతయ్యాక యశ్ ఠాకూర్ (21; 5 ఫోర్లు)ను అర్జన్ అవుట్ చేయగా, కాసేపటికే ఖలీల్ అహ్మద్ (0) కూడా అతనికే వికెట్ అప్పగించడంతో సెంట్రల్ ఇన్నింగ్స్ సరిగ్గా 600 వద్ద ముగిసింది. అర్జన్ నాగ్వస్‌వాలాకు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌కు 162 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యమే జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది.
రాణించిన జైస్వాల్.. శ్రేయస్ ఫెయిల్
అప్పటికే ఫలితం ఖాయమైన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్ట్‌జోన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే సమయానికి 53.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన భారత డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ (16) ఈసారి విఫలమవగా, శ్రేయస్ అయ్యర్ (12) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. మిగతా వారిలో తనుశ్ కొటియాన్ (72 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు), ఆర్య దేశాయ్ (35; 5 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు.
బ్యాటింగ్‌లో రాణించిన సెంట్రల్ బౌలర్ సారాంశ్ జైన్ 5, హర్ష్ దూబే 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సారాంశ్‌కు 8 వికెట్లు దక్కాయి. అజేయ అర్ధసెంచరీ కూడా సాధించడంతో అతనికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
నార్త్‌జోన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 175 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆఖరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 278/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌జోన్ 100.1 ఓవర్లలో 361 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం ఆటలో 83 పరుగులు జోడించి మిగతా సగం వికెట్లను కోల్పోయింది.
ఓవర్‌నైట్ బ్యాటర్ శుభమ్ ఖజురియా (252 బంతుల్లో 128; 20 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరు వద్దే అవుటయ్యాడు. లోయర్ ఆర్డర్‌లో మయాంక్ డాగర్ (40 బంతుల్లో 31; 5 ఫోర్లు), సాహిల్ లోత్రా (19; 2 ఫోర్లు) కాసేపు సౌత్‌జోన్ బౌలర్లను ఎదుర్కోవడంతో జట్టు 300 పైచిలుకు స్కోరు దాటింది. అయితే 2 పరుగుల వ్యవధిలో ని«దీశ్ వీరిద్ధరిని క్లీన్»ౌల్ట్ చేయడంతో ఆలౌటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. గుర్జప్‌నీత్ 4 వికెట్లు తీయగా, నిదీశ్‌కు 3 వికెట్లు దక్కాయి.
జగదీశన్ అజేయ అర్ధశతకం
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్‌జోన్ మ్యాచ్ ముగిసే సమయానికి 24.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్ నారాయణ్ జగదీశన్ నార్త్ బౌలర్లపై మళ్లీ ఆడుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయిన జగదీశన్ (69 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించాడు. మొదట హైదరాబాదీ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ (13)తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 34 పరుగులు జతచేశాడు.
తన్మయ్‌ని అకీబ్ నబీ బౌల్డ్ చేయడంతో జగదీశన్‌కు వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (54 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా సౌత్ రెండో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ‘డ్రా’ ఫలితం ఖాయమవడంతో జగదీశన్ అర్ధసెంచరీ పూర్తవగానే ఇరుజట్ల కెప్టెన్‌ను మ్యాచ్‌ను ముందుగానే ముగించేందుకు చేతులు కలిపారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన నారాయణ్ జగదీశన్ (తొలి ఇన్నింగ్స్‌లో 197)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన