
ఆస్ట్రేలియా-తో జరగనున్న రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. అయ్యర్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు.
అదేవిధంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు దేవ్‌దత్త్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కింది. నితీశ్ ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు.
అతడు ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారయణ్ జగదీశన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఇదే టోర్నీలో సెంచరీతో మెరిసిన రుతురాజ్ గైక్వాడ్‌ను మాత్రం సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
అతడితో పాటు మధ్యప్రదేశ్ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తద్వారా వీరిద్దరూ ఇండియా రెడ్ బాల్ క్రికెట్ సెటాప్‌లో లేనిట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ టూర్‌లో అరంగేట్రం చేసిన తమిళనాడు ఆటగాడు సాయిసుదర్శన్ సైతం ఈ జట్టులో ఉన్నాడు.
ఫాస్ట్ బౌలర్లగా ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖాలీల్ అహ్మద్, యష్ ఠాకూర్‌లను ఎంపిక చేశారు. కాగా రెండో టెస్టుకు టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ జట్టుతో చేరనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
టెస్టు జట్టులోకి అయ్యర్ ఎంట్రీ?
కాగా స్వదేశంలో వెస్టిండీస్ జరగనున్న టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశముంది. ఇంగ్లండ్ టూర్‌కు, ఆసియాకప్-2025కు అయ్యర్‌ను ఎంపికచేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని తిరిగి భారత టెస్టు జట్టులోకి తీసుకు వచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియా-ఎ జట్టు రెండు టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు భారత్‌కు రానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సెప్టెంబర్-16 నుంచి సెప్టెంబర్-23 వరకు జరగనుంది. రెండు మ్యాచ్‌లు కూడా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం ఆక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్-భారత్ టెస్టు సిరీస్ మొదలు కానుంది.
భారత్-ఎ జట్టు
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్,ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్