
దులిప్ ట్రోఫీ-2025 (Duleep Trophy) రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 678 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. బెంగళూరు వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
డానిష్ మలేవర్ డబుల్ సెంచరీ
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ 102 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి.. 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. డానిష్ మలేవర్ (Danish Malewar) డబుల్ సెంచరీ (203- రిటైర్డ్ అవుట్)తో దుమ్ములేపగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ విధ్వంసకర సెంచరీ (96 బంతుల్లో 125) సాధించాడు. మిగతా వారిలో యశ్ రాథోడ్ 108 బంతుల్లో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం.. తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్ ఈస్ట్ జోన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 69.3 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ కరణ్‌జిత్ యుమ్‌నామ్ (48) టాప్ రన్‌స్కోరర్‌గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో అంకుర్ మాలిక్ 42 పరుగులతో రాణించాడు.
సెంట్రల్ జోన్ బౌలర్లలో ఆదిత్య ఠాక్రే మూడు, హర్ష్ దూబే, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ చహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌పై 347 పరుగుల ఆధిక్యం సంపాదించిన సెంట్రల్ జోన్.. శనివారం రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించింది.
నిరాశపరిచిన డానిష్.. రజత్ మరోసారి హిట్
ఈసారి ఆయుశ్ పాండే (12)తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన డబుల్ సెంచరీ వీరుడు డానిష్ మలేవర్ (15) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ శుభమ్ శర్మ సెంచరీ (122)తో చెలరేగి ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రజత్ పాటిదార్ మరోసారి అదరగొట్టాడు. 72 బంతులు ఎదుర్కొన్న ఈ కెప్టెన్ సాబ్ 66 పరుగులు చేశాడు.
నార్త్ ఈస్ట్ జోన్ ముందు భారీ లక్ష్యం
మిగతావారిలో యశ్ రాథోడ్ 78 పరుగులు సాధించగా.. దీపక్ చహర్ 21 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 80.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సెంట్రల్ జోన్.. 331 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ ముందు 679 (347+331) పరుగుల మేర భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇక ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. నార్త్ ఈస్ట్ జోన్‌ను లక్ష్యం చేరకుండా ఆపి.. ఆలౌట్ చేసేందుకు సెంట్రల్ జోన్‌కు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వీలైనంత త్వరగా పనిపూర్తి చేస్తే సెమీస్‌లోకి సెంట్రల్ జోన్ దూసుకుపోవచ్చు.
చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు!