మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన పడిక్కల్‌

Devdutt Padikkal In Tremendous Form In Vijay Hazare Trophy 2023, Scored 93 Against Bihar - Sakshi

విజయ్‌ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ప్లేయర్‌, కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), రెండు మెరుపు హాఫ్‌ సెంచరీలు (71 నాటౌట్‌, 70) చేసిన అతను.. తాజాగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 320 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌.. 80.04 సగటుతో 351 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

బీహార్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. పడిక్కల్‌తో పాటు నికిన్‌ జోస్‌ (69) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బీహార్‌.. సకీబుల్‌ గనీ అజేయ సెంచరీతో (113 నాటౌట్‌) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టాని​కి 217 పరుగులు చేసింది. బీహార్‌ ఇన్నింగ్స్‌లో గనీ మినహా అందరూ విఫలమయ్యారు. ముగ్గురు డకౌట్లు, ఇద్దరు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితం కాగా.. షర్మన్‌ నిగ్రోద్‌ (21), అమన్‌ (33 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కర్ణాటక బౌలర్లలో సుచిత్‌ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్‌ కావేరప్ప, విజయ్‌కుమార్‌ వైశాక్‌, సమర్థ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్‌, నికిన్‌ జోస్‌ రాణించడంతో 33.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో రవికుమార్‌ సమర్థ్‌ 4, కెప్టెన్‌ మయాంక్‌ అగార్వల్‌ 28, మనీశ్‌ పాండే 17 పరుగులు చేశారు. బీహార్‌ బౌలర్లలో వీర్‌ ప్రతాప్‌ సింగ్‌, రఘువేంద్ర ప్రతాప్‌ సింగ్‌, అశుతోష్‌ అమన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో కర్ణాటక పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఎగబాకింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top