Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా...

Border-Gavaskar Trophy: Australia were all out for 263 runs in 78. 4 overs against host India on the first day of second test - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో 263 ఆలౌట్‌

ఖాజా, హ్యాండ్స్‌కాంబ్‌ అర్ధ సెంచరీలు

భారత్‌ 21/0

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ రెండో టెస్టు  

ఓపెనర్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం అందించారు. గత మ్యాచ్‌లో విఫలమైన ఇద్దరు బ్యాటర్లు ఈసారి చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చారు. రెండు సందర్భాల్లో జట్టు మెరుగైన స్థితిలో నిలిచి భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయినా సరే చివరకు వచ్చేసరికి ఆస్ట్రేలియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. తొలి టెస్టుతో పోలిస్తే కాస్త ఫర్వాలేదనిపించినా ఓవరాల్‌గా మొదటి రోజే ఆలౌట్‌ అయిన జట్టు ఆట ఆశలు రేపేలా లేదు! షమీ పదునైన పేస్‌కు తోడు అశ్విన్, జడేజా స్పిన్‌తో ఆసీస్‌ను దెబ్బ కొట్టారు. బ్యాటింగ్‌కు ఏమాత్రం ఇబ్బందిగా లేని పిచ్‌పై రెండో రోజు భారత్‌ ఎంత స్కోరు సాధిస్తుందనేది ఆసక్తికరం. 

న్యూఢిల్లీ: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ రెండో టెస్టులోనూ మొదటి రోజు భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యాండ్స్‌కాంబ్‌ (142 బంతుల్లో 72 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మొహమ్మద్‌ షమీ (4/60) ప్రత్యర్థిని పడగొట్టగా, అశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం  ఎలాంటి ఇబ్బంది లేకుండా 9 ఓవర్లు ఎదుర్కొన్న భారత్‌ ఆట ముగిసే సమయానికి 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13 బ్యాటింగ్‌), రాహుల్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నా రు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న భారత సీనియర్‌ క్రికెటర్‌ పుజారా ను దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సన్మానించారు.  

స్మిత్‌ డకౌట్‌...
గత మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి గంట పాటు కాస్త ప్రతిఘటన కనబర్చగలిగారు. ఖాజా ఆత్మవిశ్వాసంతో ఆడగా, వార్నర్‌ (15; 3 ఫోర్లు)లో తడబాటు కొనసాగింది. 21వ బంతికి గానీ అతను తొలి పరుగు తీయలేకపోయాడు. ఈ క్రమంలో సిరాజ్‌ బౌలింగ్‌లో మోచేతికి, హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో వార్న ర్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. షమీ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన వార్నర్‌ అతని తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు.

మరోవైపు స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టిన ఖాజా 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆసీస్‌కు అసలు దెబ్బ అశ్విన్‌ ఓవర్లో తగిలింది. 91/1తో మెరుగ్గా ఉన్న స్థితిలో లబుషేన్‌ (18)ను అశ్విన్‌ వికెట్ల   ముందు దొరకబుచ్చుకోగా... మరో రెండు బంతులకే భరత్‌ చక్కటి క్యాచ్‌తో స్మిత్‌ (0) డకౌట్‌ కావడం ఒక్కసారిగా కంగారూలు వెనక్కి తగ్గేలా చేసింది. రెన్‌షా స్థానంలో ఈ మ్యాచ్‌లోకి వచ్చిన ట్రవిస్‌ హెడ్‌ (12; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ఎక్కువసేపు నిలవలేదు.  

కీలక భాగస్వామ్యాలు...
ఆసీస్‌ను గట్టెక్కించే బాధ్యత ఖాజా, హ్యాండ్స్‌కాంబ్‌లపై పడింది. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్నంతసేపు చకచకా పరుగులు జోడించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకొని వీరు పరుగులు         రాబట్టారు. అయితే స్వీప్‌ షాట్లతోనే 29 పరుగులు సాధించిన ఖాజా చివరకు అదే షాట్‌కు వికెట్‌ను సమర్పించుకున్నాడు. క్యారీ (0) వెంటనే అవుట్‌ కాగా... ఈసారి ప్యాట్‌ కమిన్స్‌ (33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. మరోవైపు  110 బంతుల్లో హ్యాండ్స్‌కాంబ్‌ అర్ధ సెంచరీ      పూర్తయింది. ఆసీస్‌ జోరు పెంచుతున్న దశలో రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో కమిన్స్, మర్ఫీ (0) వికెట్లతో దెబ్బ కొట్టాడు. చివరి రెండు వికెట్ల షమీ ఖాతాలోకి వెళ్లాయి.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) భరత్‌ (బి) షమీ 15; ఖాజా (సి) రాహుల్‌ (బి) జడేజా 81; లబుషేన్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 18; స్మిత్‌ (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 0; హెడ్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 12; హ్యాండ్స్‌కాంబ్‌ (నాటౌట్‌) 72; క్యారీ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 0; కమిన్స్‌ (ఎల్బీ) (బి) జడేజా 33; మర్ఫీ (బి) జడేజా 0; లయన్‌ (బి) షమీ 10; కున్‌మన్‌ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (78.4 ఓవర్లలో ఆలౌట్‌) 263.
వికెట్ల పతనం: 1–50, 2–91, 3–91, 4–108, 5–167, 6–168, 7–227, 8–227, 9–246, 10–263.
బౌలింగ్‌: షమీ 14.4–4–60–4, సిరాజ్‌ 10–2–30–0, అశ్విన్‌ 21–4–57–3, జడేజా 21–2–68–3, అక్షర్‌ 12–2–34–0.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బ్యాటింగ్‌) 13, రాహుల్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 21.
బౌలింగ్‌: కమిన్స్‌ 3–1–7 –0, కున్‌మన్‌ 4–1–6–0, లయన్‌ 2–0–4–0.  

13: భారత్‌ తరఫున 100 టెస్టులు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్‌ కుంబ్లే, కపిల్‌దేవ్, సునీల్‌ గావస్కర్, వెంగ్‌ సర్కార్, గంగూలీ, కోహ్లి, ఇషాంత్‌ శర్మ, హర్భజన్‌æ,  సెహ్వాగ్‌ ఈ ఘనత సాధించారు.
1: అంతర్జాతీయ టి20 ఫార్మాట్‌ మొదలయ్యాక ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడకుండానే 100 టెస్టులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌ పుజారా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top