
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో ఆటగాడు కూడా ఈ జాబితాలో చేరాడు. ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరూర్కీ (William O'Rourke) ఆటకు మూడు నెలల పాటు దూరంగా ఉండనున్నాడు.
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూజిలాండ్ క్రికెట్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఈనెలలో జింబాబ్వే పర్యటనలో భాగంగా తొలి టెస్టు సందర్భంగా 24 ఏళ్ల విలియమ్ గాయపడ్డాడు. అతడి వెన్ను నొప్పి దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో.. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకున్నాడు.
కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి
ఈ క్రమంలో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. కనీసం మూడు నెలలపాటు విలియమ్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. కాగా అక్టోబరులో ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో కూడా తలపడాల్సి ఉంది.
గ్లెన్, ఫిన్ కూడా అవుట్
ఈ మూడు ప్రధాన సిరీస్‌లకు విలియమ్ ఓరూర్కీ దూరం కానున్నాడు. మరోవైపు.. ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philps) గజ్జల్లో గాయం కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇక ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా కుడికాలి పాదం నొప్పితో కనీసం మూడు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి.
సారథికీ గాయం
ఇదిలా ఉంటే.. కివీస్ వన్డే, టీ20 క్రికెట్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కూడా గాయపడటం గమనార్హం. గజ్జల్లో నొప్పి కారణంగా అతడు ఇటీవలే ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చాడు. ది హండ్రెడ్ లీగ్ నుంచి అర్ధరంతంగా తప్పుకొన్నాడు. సాంట్నర్ కూడా నెలరోజుల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అతడొక వరల్డ్ క్లాస్‌ప్లేయర్.. జట్టులో ఉంటాడు
ఈ విషయాల గురించి న్యూజిలాండ్ హెడ్‌కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘విలియమ్ పరిస్థితి బాధాకరంగా ఉంది. అతడు త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. గ్లెన్, ఫిన్ కూడా ఇప్పటికే దూరమయ్యారు.
ఇటీవలి కాలంలో వీరిద్దరు టీ20 జట్టులో కీలక బ్యాటర్లుగా మారిపోయారు. కానీ దురదృష్టవశాత్తూ గాయాలు వారిని వెంటాడుతున్నాయి. మిచెల్ సాంట్నర్ ఓ వరల్డ్‌క్లాస్ ప్లేయర్. ఆటగాడిగా, కెప్టెన్‌గా అతడి నైపుణ్యాలు అమోఘం. జట్టులో అతడు ఉంటాడు.
అయితే, సర్జరీ తర్వాత ఫిట్‌నెస్ ఆధారంగా మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్నది తేలుతుంది’’ అని తెలిపాడు. మరోవైపు.. పేస్ బౌలర్ బెన్ సీర్స్ రూపంలో కివీస్‌కు శుభవార్త అందింది. పక్కటెముకల నొప్పి నుంచి అతడు కోలుకున్నాడు. కాగా గాయం వల్ల ఈ పేస్ బౌలర్ జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: ఒక్క సిక్స్‌తో అంతా తలకిందులయ్యేది.. అప్పుడు నేను..: సిరాజ్