వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 5) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్ చెలరేగినా న్యూజిలాండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.
ఈ ఇన్నింగ్స్‌తో సాంట్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్ సాంట్నర్ సహచరుడు టిమ్ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (39) రషీద్ ఖాన్ పేరిట సంయుక్తంగా ఉండేది.
ఈ మ్యాచ్‌లో 107/9 స్కోర్ వద్ద జేకబ్ డఫీతో (1 నాటౌట్) సాంట్నర్ పదో వికెట్‌కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్-బ్యారీ మెక్‌కార్తీ (44*) పేరిట ఉండేది.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షాయ్ హోప్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ను సాంట్నర్ (55 నాటౌట్) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో 3 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా నవంబర్ 6న జరుగనుంది.
చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా


