
ఐపీఎల్‌లో ప్రతిభను నిరూపించుకుని ఇటీవల టీమిండియాలోకి దూసుకువచ్చిన ఆటగాళ్లలో హర్షిత్ రాణా (Harshit Rana) ఒకడు. గతేడాది శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలవడంలో ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ది కీలక పాత్ర. 13 మ్యాచ్‌లలో కలిపి ఈ పేస్‌బౌలర్ పందొమ్మిది వికెట్లు కూల్చాడు.
గంభీర్ దృష్టిలో పడి
కేకేఆర్ తరఫున ప్రదర్శన ద్వారా అప్పటి మెంటార్ గౌతం గంభీర్ (Gautam Gambhir) దృష్టిలో పడిన హర్షిత్ రాణా.. గౌతీ టీమిండియా హెడ్‌కోచ్‌గా రావడంతో త్వరగానే జాతీయ జట్టులోకి వచ్చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్ ఈ ఏడాది టీ20, వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
ఒకే ఓవర్లో 26 పరుగులు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో టీమిండియా ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్ సందర్భంగా వన్డేలోకి వచ్చిన హర్షిత్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. అతడి బౌలింగ్‌లో ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒకే ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు.
అయితే, సాల్ట్‌ను శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కలిసి సాల్ట్ (43)ను రనౌట్ చేయడంతో హర్షిత్‌కు కాస్త ఊరట దక్కింది. ఆ తర్వాత 23 ఏళ్ల ఈ బౌలర్.. మూడు వికెట్లతో సత్తా చాటాడు. పరుగులు కాస్త ఎక్కువగానే ఇచ్చుకున్నా.. బెన్ డకెట్ (32), హ్యారీ బ్రూక్ (0), లియామ్ లివింగ్‌స్టోన్ (5) వంటి ప్రమాదకర బ్యాటర్లును అవుట్ చేశాడు. తద్వారా టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు.
శ్రేయస్ భయ్యా సాల్ట్‌ను రనౌట్ చేయగానే
ఇక హర్షిత్ రాణా ప్రస్తుతం ఆసియా కప్-2025 ఆడేందుకు టీమిండియాతో కలిసి యూఏఈలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో అతడు పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. వన్డే అరంగేట్రం గురించి గుర్తుచేసుకుంటూ.. ‘‘ఒక్క ఓవర్లోనే సాల్ట్ నా నుంచి 26 పరుగులు రాబట్టుకున్నాడు.
అయితే, ఆ తర్వాత పరిస్థితి మారింది. తొలి మూడు ఓవర్లలో నేను 37 పరుగుల వరకే ఇచ్చాను. అయితే, శ్రేయస్ భయ్యా సాల్ట్‌ను అద్బుత రీతిలో రనౌట్ చేయగానే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేనేమో సైలెంట్‌గా అక్కడ నిల్చున్నా.
రోహిత్ భయ్యా వచ్చి.. ‘వేరే ఎండ్ నుంచి బౌల్ చెయ్’ అని చెప్పాడు. వెంటనే నా బౌలింగ్‌లో డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ పట్టాడు. తర్వాత హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే అతడిని పెవిలియన్‌కు పంపాలని అనుకున్నా.
సర్ పే మారూ
అందుకోసం తల మీదుగా బౌన్సర్ ఎందుకు సంధించకూడదు అని ఆలోచించా. వెంటనే.. ‘రోహిత్ భయ్యా.. సర్ పే మారూ (head-high bouncer) ’ అని అడిగాను. అందుకు భయ్యా సరేనంటూ అంగీకరించాడు. షార్ట్ పిచ్‌డ్ డెలివరీ సంధించగా,, బ్రూక్ దానిని షాట్ ఆడబోయి రాహుల్ భయ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు’’ అని హర్షిత్ రాణా వన్డే అరంగేట్ర జ్ఞాపకాలు పంచుకున్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ హర్షిత్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచిన టీమిండియాలో తానూ ఒకడిగా ఉండి.. ట్రోఫీని ముద్దాడాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఆయా ఫార్మాట్లలో 4, 10, 3 వికెట్లు కూల్చాడు.
చదవండి: ‘యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు.. బుమ్రాను తీర్చిదిద్దండి’