
సెహ్వాగ్- యువీ (PC: BCCI)
టీమిండియా లోయర్ ఆర్డర్ గురించి భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లందరినీ ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాలని.. వారిని టెయిలెండర్లు అని పిలవద్దని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కాగా భారత జట్టు చివరగా ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
శుబ్‌మన్ గిల్ (Shubman Gill) టెస్టు జట్టు నయా సారథిగా పగ్గాలు చేపట్టగా.. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడింది. ఆఖరి టెస్టు ఆఖరి రోజు వరకు పోరాడి సిరీస్‌ను 2-2తో సమం చేసుకుని గట్టెక్కింది. ఇక ఇంగ్లండ్‌లో భారత లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది.
యువీ, సెహ్వాగ్ వంటి వారే లేరు
ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు సైతం హాఫ్ సెంచరీలతో అలరిస్తే మనవాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా అంతా ఇలా వెళ్లి అలా వచ్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యోగ్‌రాజ్ సింగ్ మాట్లాడుతూ.. భారత జట్టుకు ప్రస్తుతం తన కుమారుడు యువరాజ్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ వంటి పూర్తిస్థాయి ఆల్‌రౌండర్ల అవసరం ఉందన్నాడు.
‘‘భారత జట్టులో ప్రస్తుతం ఉన్న సమస్య లోయర్ ఆర్డర్. బౌలర్లను ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దడానికి మనవాళ్లు ఆసక్తి చూపడం లేదు. కపిల్ దేవ్ నెట్స్‌లో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. అప్పుడు నేను.. ‘కపిల్‌తో బ్యాటింగ్ చేయించండి’ అంటూ గొంతు చించుకునేవాడిని.
బుమ్రాను తీర్చిదిద్దండి
ఆ రోజుల్లో కపిల్ పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 70- 80 పరుగులు స్కోరు చేసేవాడు. ఈరోజుల్లోనూ బుమ్రా వంటి బౌలర్లను టెయిలెండర్లు అని పిలవవద్దు. వారిని మెరుగైన ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
ప్రాక్టీస్ సెషన్‌లో కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు వారితో బ్యాటింగ్ చేయించాలి. గతం తాలుకు చేదు అనుభవాల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే అత్యుత్తమ మార్గం.
టెయిలెండర్ల తప్పేం లేదు
ఒకవేళ మన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బాగా ఆడి ఉంటే లార్డ్స్ టెస్టులో ఇరవై రెండు పరుగుల తేడాతో ఓడిపోయేవాళ్లమే కాదు. అయినా ఇందులో టెయిలెండర్ల తప్పేం లేదు. ఎందుకంటే వారికి బ్యాట్‌తో ప్రాక్టీస్ చేసేందుకు తగినంత సమయం ఇవ్వలేదు’’ అని యోగ్‌రాజ్ సింగ్ ఇన్‌సైగ్‌స్పోర్ట్‌తో చెప్పుకొచ్చాడు.
యువీ ఇలా.. వీరూ అలా..
ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్ 2000- 2017 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. 40 టెస్టుల్లో 1900, 304 వన్డేల్లో 9924, 58 అంతర్జాతీయ టీ20లలో 1177 పరుగులు సాధించాడు.
అదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన యువీ ఖాతాలో టెస్టుల్లో తొమ్మిది, వన్డేల్లో 111, టీ20లలో 28 వికెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో వీరేందర్ సెహ్వాగ్ 1999 నుంచి 2013 వరకు టీమిండియాకు ఆడాడు.
మొత్తంగా 104 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన వీరూ.. టెస్టుల్లో 40, వన్డేల్లో 96 వికెట్లు తీశాడు.
చదవండి: పక్షవాతం.. నొప్పి భరించలేకపోయా: టీమిండియా స్టార్ క్రికెటర్