
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌ను అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. హాంకాంగ్‌ను 94 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఈ టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది. అబుదాబి వేదికగా మంగళవారం మొదలైన ఈ టీ20 ఈవెంట్ తొలి మ్యాచ్‌లో గ్రూప్- ‘బి’లో భాగమైన అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) తలపడ్డాయి.
టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ సెదీఖుల్లా అజేయ అర్ధ శతకం (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అద్భుత ప్రదర్శన కనబరచగా.. నాలుగో స్థానంలో వచ్చిన మహ్మద్ నబీ (26 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు.
ఆకాశమే హద్దుగా.. ఇరవై బంతుల్లోనే
ఇక లోయర్ ఆర్డర్‌లో అఫ్గన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (Azmatullah Omarzai) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 21 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 53 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లతో పాటు ఏకంగా ఐదు సిక్సర్లు ఉన్నాయి.
సూర్య రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర
ఈ క్రమంలోనే ఒమర్జాయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు.
కాగా ఆసియా కప్-2022 సందర్భంగా సూర్య హాంకాంగ్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఒమర్జాయ్ తాజాగా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు అఫ్గన్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.
కేవలం 94 పరుగులే చేసి..
ఇదిలా ఉంటే.. అఫ్గన్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పసికూన హాంకాంగ్ విఫలమైంది. ఓపెనర్లు జీషన్ అలీ (5), అన్షుమన్ రథ్ (0) నిరాశపరచగా.. నిజఖత్ ఖాన్ (0), కించిత్ షా (6), ఐజాజ్ ఖాన్ (6), ఎషాన్ ఖాన్ (6) పూర్తిగా తేలిపోయారు. ఆఖర్లో ఆయుశ్ శుక్లా 1, అతీక్ ఇక్బాల్ ఒక పరుగుతో అజేయంగా నిలిచారు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ హయత్ 39 పరుగులతో హాంకాంగ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా 16 పరుగులు చేయగలిగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి తాళలేక హాంకాంగ్ బ్యాటర్లు ఇలా పెవిలియన్‌కు వరుస కట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో జట్టు తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అఫ్గన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫారూఖీ, గుల్బదిన్ నైబ్ రెండేసి వికెట్లు కూల్చగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. బ్యాట్‌తో, బాల్‌తో రాణించి అజ్మతుల్లా ఒమర్జాయ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఆసియా టీ20 టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు నమోదు చేసింది వీరే..
🏏అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గనిస్తాన్)- హాంకాంగ్ మీద-20 బంతుల్లో
🏏సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- హాంకాంగ్ మీద- 22 బంతుల్లో
🏏రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్)- శ్రీలంక మీద- 22 బంతుల్లో.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు