
అలీసా హీలీ మరో సెంచరీ
బంగ్లాదేశ్‌పై 10 వికెట్లతో నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్‌కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్‌ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్‌హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్‌నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్‌లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్‌ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది.