
PC: BCCI
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా తొలి మ్యాచ్‌లోనే తమ సత్తా చూపించింది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఈవెంట్లో తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టుతో తలపడిన సూర్యకుమార్ సేన ఏకపక్ష విజయం సాధించింది.
యూఏఈని తొలుత 57 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు.. కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. తద్వారా తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీ ఆరంభానికి ముందు యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో టీ20 ట్రై సిరీస్ ఆడింది. అయితే, ఈ రెండు జట్లపై మరీ అంత సునాయాసంగా మాత్రం గెలవలేకపోయింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై మాత్రం 93 పరుగుల తేడాతో గెలిచింది.
వైభవ్ సూర్యవంశీ వంటి వాళ్లు చాలు!
ఇక ఆసియా కప్ టోర్నీలో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించడం ఖాయం అంటున్నారు.
అంతేకాదు.. ప్రస్తుత బలాబలాల దృష్ట్యా దాయాది స్థాయికి భారత ద్వితీయ శ్రేణి జట్టు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి ఐపీఎల్ స్టార్లు ఉన్న జట్టుతో పాక్‌ను ఓడించవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చాలి
ఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఆసియా క్రికెట్ మండలి (ACC)కి ఓ విజ్ఞప్తి చేశాడు. సౌతాఫ్రికాను కూడా ఈ టోర్నీలో చేర్చి.. దీనిని ఆఫ్రో-ఆసియా కప్‌గా మార్చాలన్నాడు. అంతేకాదు.. భారత్ నుంచి ప్రధాన జట్టుతో పాటు ‘ఎ’ టీమ్‌ను కూడా బరిలో దించాలని.. అప్పుడే కాస్త పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుంది
ఇక టీమిండియా మాజీ పేసర్ అతుల్ వాసన్ (Atul Wassan) తాజాగా మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రస్తుత జట్టును ఓడించేందుకు భారత ద్వితీయ శ్రేణి జట్టు చాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘‘90వ దశకంలో పాకిస్తాన్ పటిష్ట జట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో పాకిస్తాన్‌ను ఓడించేందు ఇండియా- ‘బి’ జట్టు సరిపోతుంది.
రో-కోను మిస్ కావడం లేదు
ఏదేమైనా ఈ టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గైర్హాజరీ మాత్రం నన్ను బాధించడం లేదు. ఎందుకంటే వారి గురించి ఆలోచించడం మొదలుపెడితే.. నేను సునిల్ గావస్కర్, కపిల్ దేవ్‌ల గురించి ఆలోచిస్తూనే ఉండిపోతాను. కాలంతో పాటుగా ముందుకు సాగటమే ఉత్తమం’’ అని అతుల్ వాసన్ న్యూస్18తో పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రంపచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టులకు కూడా ఈ దిగ్గజాలు వీడ్కోలు పలికారు.
చదవండి: బుమ్రా బౌలింగ్‌లో మా వాడు 6 సిక్స్‌లు కొడతాడు: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్