ఓ 4 పాస్‌లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్‌ చైర్మన్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌! | Arun Dhumal Reacts final shifted out of Bengaluru KA HM Comments | Sakshi
Sakshi News home page

ఓ 4 పాస్‌లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్‌ చైర్మన్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌!

May 8 2026 4:22 PM | Updated on May 8 2026 4:28 PM

Arun Dhumal Reacts final shifted out of Bengaluru KA HM Comments

ఐపీఎల్‌-2026 ఫైనల్‌ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు మార్చడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (KSCA) ఏకంగా 10 వేలకు పైగా కాంప్లిమెంటరీ టికెట్లు కోరిందనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. ఇలాంటి తరుణంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది.. అది వర్క్‌ఔట్‌ కాదని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ తెలిపారు. 

నాలుగు పాస్‌లు ఇస్తే ఏమవుతుంది?
ఐపీఎల్‌ ఫైనల్స్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మార్చడంపై స్పందిస్తూ.. ‘‘భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికి 5 మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది.

25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసింది’’ అన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్‌లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. అభిమానుల సౌకర్యం కోసమే ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఫైనల్‌ వేదికను అహ్మదాబాద్‌గా నిర్ణయించినట్లు తెలిపారు. 

ఐపీఎల్‌ చైర్మన్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌!
కాగా మే 31న జరగనున్న ఐపీఎల్‌-2026 ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. గత సీజన్‌ విజేత జట్టు సొంత మైదానంలో ఈ ఏడాది ఫైనల్‌ జరగడం పరిపాటి.

అయితే పలు కారణాల వల్ల వేదికను మార్చినట్లు ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. ఐపీఎల్‌ 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలవగా... ఈ సారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌ నిర్వహించాల్సి ఉంది. 

కానీ చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండటంతో పాటు... కర్ణాటక క్రికెట్‌ సంఘం (KSCA) పెద్ద సంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లు కోరడం... గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో వేదిక మార్చినట్లు తెలుస్తోంది.

చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు కాగా... నరేంద్ర మోదీ స్టేడియంలో 1,32,000 మంది మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. ‘సాధారణంగా చూసుకుంటే ఈ ఏడాది బెంగళూరులో ఐపీఎల్‌ ఫైనల్‌ జరగాలి. దీని కోసం మేం కర్ణాటక క్రికెట్‌ సంఘాన్ని సంప్రదించాం. 

ఉచిత టికెట్లు
గతేడాది ఫైనల్‌ అనంతరం తొక్కిసలాట జరిగింది. దీంతో పాటు పలు సవాళ్లు ఎదురయ్యాయి. తమ సభ్యులు, అనుబంధ క్లబ్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఉచిత టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని కర్ణాటక సంఘం తెలిపింది.

స్టేడియం సామర్థ్యం కూడా ఎక్కువ లేదు. ఐపీఎల్‌ ఫైనల్‌పై ఆసక్తి అత్యధికంగా ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు వస్తారు. వారి కోసం ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండాలి. 

అదే సమయంలో ఐసీసీ బోర్డు సమావేశం కూడా ఉంది. దాని కోసం కూడా చాలా మంది సభ్యులు వస్తున్నారు. ఇలా వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పెద్ద వేదిక అయితేనే సముచితంగా ఉంటుందని భావించాం.

అందుకే అహ్మదాబాద్‌ను ఎంచుకున్నాం. ఒకవేళ గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గి ఉంటే... ఈ సారి చెన్నైలోనే ఫైనల్‌ నిర్వహించేవాళ్లం’ అని ధుమాల్‌ వివరించారు.

చదవండి: ఆమెతో బంధం ఇక చట్టబద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement