భారత మహిళల ఫుట్‌బాల్ జట్టుకు స్వదేశీ కోచ్‌ను నియమించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం జాతీయ జట్టు కోచ్‌గా పనిచేస్తున్న కోస్టారికాకు చెందిన అమేలియా వాల్‌వర్డె కాంట్రాక్టును పునరుద్ధరించబోవడం లేదని ప్రకటించింది.
ఇటీవల ఆ్రస్టేలియా వేదికగా జరిగిన ఆసియా కప్‌లో అమేలియా కోచింగ్‌లో బరిలోకి దిగిన భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. కేవలం ఈ టోర్నీ కోసమే అమేలియాను జనవరిలో మూడు నెలల కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక చేశారు. అమ్మాయిల జట్టుకు స్వదేశీ కోచ్ ఉండటమే ఉత్తమమని ఐఎం విజయన్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో... ఏఐఎఫ్‌ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
పురుషుల, మహిళల జాతీయ జట్ల భవిష్యత్తుపై చర్చించేందుకు మంగళవారం ఏఐఎఫ్‌ఎఫ్ సాంకేతిక కమిటీ ఆన్‌లైన్‌లో సమావేశమైంది. విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో... హర్జిందర్ సింగ్, షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్, లారెన్స్, సంతోష్ సింగ్ పాల్గొన్నారు. అమేలియా కోచింగ్‌లో జట్టు ప్రదర్శనపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
మూడు నెలల పాటు జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అమేలియాకు ధన్యవాదాలు తెలిపిన కమిటీ... ఈ ఏడాది జూన్‌లో జరిగే దక్షిణాసియా చాంపియన్‌షిప్ ప్రారంభానికి ముందే స్వదేశీ కోచ్‌ను నియమించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఏఐఎఫ్‌ఎఫ్ తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత ఫుట్‌బాల్ మహిళల జట్టుకు కోచ్‌గా పని చేయడానికి ఆంథోని ఆండ్రూస్, క్రిస్పిన్ ఛెత్రీలు ఆసక్తిగా ఉన్నట్లు ఏఐఎఫ్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం!


