బీసీసీఐతో తెగదెంపులు చేసుకున్న రైనా.. ఫారిన్‌ లీగ్‌లో అరంగేట్రం

Abu Dhabi T10 League: Suresh Raina Joins Deccan Gladiators - Sakshi

టీమిండియా మాజీ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సురేశ్‌ రైనా భారత క్రికెట్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు సైతం ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన చిన్న తలా.. బీసీసీఐ, తదితర అనుబంధ క్రికెట్‌ బోర్డులతో తెగదెంపులు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో  నిరాశచెందిన రైనా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బీసీసీఐతో బంధం​ తెగిపోవడంతో రైనా చూపు ఇప్పుడు విదేశీ లీగ్‌లపై పడింది. దుబాయ్‌ వేదికగా జరుగనున్న అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు రైనా సర్వం సిద్ధం చేసుకున్నాడు. 

ఈ లీగ్‌లో రైనా.. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. టీ20 క్రికెట్‌కు భారత్‌ అందించిన అతి గొప్ప క్రికెటర్‌ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్‌ కూడా చేసింది. కాగా, రైనా ప్రాతినిధ్యం వహించబోయే డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ తరఫున విండీస్‌ స్టార్‌ ఆటగాళ్లు ఆండ్రీ రసెల్‌, నికోలస్‌ పూరన్‌లు ఆడుతున్నారు. ఈ లీగ్‌ ఈ ఏడాది నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 4 వరకు జరుగనుంది. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top