ఆయుశ్‌ అద్భుతం | Aayush Shetty sensational victory over world number seven | Sakshi
Sakshi News home page

ఆయుశ్‌ అద్భుతం

Apr 9 2026 3:44 AM | Updated on Apr 9 2026 3:44 AM

Aayush Shetty sensational victory over world number seven

ప్రపంచ ఏడో ర్యాంకర్‌పై సంచలన విజయం

ప్రణయ్‌ కూడా ముందంజ

తొలి రౌండ్‌లోనే ఓడిన లక్ష్య సేన్, శ్రీకాంత్‌  

నింగ్బో (చైనా): ఆసియా సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టి సంచలనంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్‌ ఆయుశ్‌ 21–13, 21–16తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ లిన్‌ షి ఫెంగ్‌ (చైనా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆయుశ్‌ తొలుత వెనుకబడ్డా... సంయమనం కోల్పోకుండా ఆడి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. 

భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా ముందంజ వేశాడు. ప్రణయ్‌ 24–22, 21–12తో నుగుయెన్‌ హాయ్‌ డాంగ్‌ (వియత్నాం)పై గెలుపొందాడు. అయితే పతకం సాధిస్తాడనుకున్న భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచారు. ప్రపంచ 22వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యి (హాంకాంగ్‌)తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 12–21, 19–21తో ఓడిపోయాడు. లీ చెయుక్‌ చేతిలో లక్ష్య సేన్‌కిది నాలుగో ఓటమి కావడం గమనార్హం. 

ఈ ఏడాది మలేసియా ఓపెన్‌లోనూ లీ చెయుక్‌ చేతిలో లక్ష్య సేన్‌ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ (సింగపూర్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–18, 9–21, 11–21తో ఓటమి చవిచూశాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించడంలో విఫలమై ఓటమి మూటగట్టుకున్నాడు. 

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిమ్రన్‌–కవిప్రియ సెల్వం (భారత్‌) జోడీ 9–21, 8–21తో లీ యి జింగ్‌–లువో జు మిన్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్‌) ద్వయం 21–15, 17–21, 21–13తో ఫామ్‌ థి డియు లె–ఫామ్‌ థి కాన్‌ (వియత్నాం) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement