నితేశ్‌కు రజతం | Nitesh wins silver at Asian Senior Wrestling Championship | Sakshi
Sakshi News home page

నితేశ్‌కు రజతం

Apr 9 2026 3:40 AM | Updated on Apr 9 2026 3:40 AM

Nitesh wins silver at Asian Senior Wrestling Championship

కాంస్యాలు గెలిచిన ప్రిన్స్, సచిన్‌  

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత రెజ్లర్లు నితేశ్‌ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్‌ (82 కేజీలు), సచిన్‌ సెహ్రావత్‌ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ మొహమ్మధాది సరావి (ఇరాన్‌)తో జరిగిన ఫైనల్లో నితేశ్‌ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. 

దిదార్‌ అమన్‌జరోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో ప్రిన్స్‌ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్‌ అమినోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో సచిన్‌ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్‌గా గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 

195 పాయింట్లతో ఇరాన్‌ గ్రీకో రోమన్‌ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్‌ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్‌ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్‌ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన కాజల్‌ (76 కేజీలు), నీలమ్‌ (50 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం చవిచూశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement