టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్‌కే తమ చివరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది.
అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ క్రమంలో సంజూ మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు పక్కన తాను కారు ఆపాడు. అయితే అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్‌లో సంజూ ఉండడంతో చూసి తన బైక్‌ను అతడు ఆపాడు.
శాంసన్ తన ఫోన్ కాల్ ముగించిన తర్వాత శబరీష్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఫొటో దిగుదామా అని సంజూనే స్వయంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్‌ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు.
దీంతో వెంటనే సంజూ తన వద్ద ఉన్న రూ. 40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు బహుమతిగా ఇచ్చాడు. సదరు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.
చదవండి: IPL 2026: జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 23 పరుగులు! వీడియో


