ఉత్కంఠ పోరు.. ఒకే ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి | DC vs GT, IPL 2026: Gujarat Titans win by 1 run | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠ పోరు.. ఒకే ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి

Apr 9 2026 12:06 AM | Updated on Apr 9 2026 12:06 AM

DC vs GT, IPL 2026: Gujarat Titans win by 1 run

ఐపీఎల్‌-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది.  211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది.

చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ వేసిన 19 ఓవర్‌లో ఢిల్లీ బ్యాటర్‌ డేవిడ్ మిల్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగిపోయింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయసమీకరణం 13 పరుగులగా మారింది. 

చివరి ఓవర్ వేసే బాధ్యతను గుజరాత్ కెప్టెన్‌.. ప్రసిద్ద్ కృష్ణకు అప్పగించాడు. అయితే తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీగా మలిచాడు. తర్వాతి బంతికి నిగమ్ ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 4 బంతుల్లో 9 పరుగులగా మారింది. మూడో బంతికి కుల్దీప్ సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ సిక్సర్‌గా మలిచాడు. దీంతో రెండు బంతుల్లో ఢిల్లీకి రెండు పరుగులు అవసరయ్యాయి. మిల్లర్ క్రీజులో ఉండడంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని భావించారు. 

ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకున్నాడు. కానీ అయితే ఆఖరి బంతిని ప్రసిద్ద్ అద్భుతమైన బౌన్సర్‌గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. మిల్లర్‌ బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ సూపర్‌త్రోతో స్ట్రైకర్ ఎండ్ వైపు  స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

ఒకవేళ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మిల్లర్‌తో పాటు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. రాహుల్‌ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. అయినప్పటికి ఢిల్లీ ఓడిపోవడంతో రాహుల్‌, మిల్లర్(20 బంతుల్లో 41) ఇన్నింగ్స్‌లు వృథా అయిపోయాయి.  గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ రెండు, సిరాజ్‌ ఓ వికెట్‌ సాధించాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్‌(70), జోస్‌ బట్లర్‌(52), వాషింగ్టన్‌ సుందర్‌(55) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్‌ కుమార్‌ రెండు, ఎంగిడి, కుల్దీప్‌ యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement