
ప్రపంచ 9వ ర్యాంకర్ నరోకాపై గెలుపు
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కొడాయ్ నరోకా (జపాన్)ను బోల్తా కొట్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఆయుశ్ 72 నిమిషాల్లో 21–19, 12–21, 21–14తో ఐదో సీడ్ నరోకాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 15–21, 21–18, 21–10తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లో ఆయుశ్ శెట్టితో తలపడేందుకు సిద్ధమయ్యాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి (భారత్) 6–21, 12–21తో చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 18–21, 21–15, 21–11తో పిరత్‌చాయ్ సుఖ్‌ఫున్–పకాపోన్ తీరత్‌సాకుల్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జోడీ 13–21, 7–21తో లి యి జింగ్–లువో జు మిన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.