
సింగిల్స్ టైటిల్ పోరుకు లక్ష్యసేన్
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంకాంగ్: భారత బ్యాడ్మింటన్ అగ్ర శ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో టైటిల్ పోరుకు సిద్ధమైంది. సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న భారత ఆటగాడు 23–21, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, మూడో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ని కంగు తినిపించాడు. సుమారు గంటపాటు హోరా హోరీగా జరిగిన సమరంలో లక్ష్యసేన్ ఏ దశలోనూ పట్టు సడలించలేదు.
నేడు జరిగే టైటిల్ పోరులో చైనాకు చెందిన రెండో సీడ్ లి షి ఫెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఏడాది సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెమీస్‌తోనే ఆగిపోతున్నారు. ఆరు టోర్నీల్లో సెమీస్‌తోనే ముగిసిన భారత జోడీ పోరాటం ఇక్కడ ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్‌లో తొలిసారి సాత్విక్–చిరాగ్‌లు ఎట్టకేలకు టైటిల్ వేటలో అడుగు దూరంలో ఉన్నారు.
తాజా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య విజేత అయిన భారత డబుల్స్ జోడీ వరుస సెట్లలో చైనీస్ తైపీకి చెందిన బింగ్ వే లిన్–చెన్ చెంగ్ కున్ జంటను కంగుతినిపించింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న సాత్విక్–చిరాగ్ ద్వయం 21–17, 21–15తో తైపీ జోడీని కంగుతినిపించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఎనిమిదో సీడ్ భారత జోడీ... పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేతలైన లియాంగ్ వే కెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) జంటతో తలపడుతుంది.