
ప్రపంచ ఆరో ర్యాంకర్‌పై గెలుపుతో క్వార్టర్ ఫైనల్లోకి
నేడు వరల్డ్ నంబర్‌వన్ ఆన్ సె యంగ్‌తో పోరు
షెన్‌జెన్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు సంచలన విజయం నమోదు చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–15, 21–15తో గెలుపొందింది. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది.
తొలి గేమ్ ఆరంభంలో తొలి పాయింట్ చేజార్చుకున్న సింధు ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 6–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 6–4 వద్ద సింధు మళ్లీ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–4తో ముందంజ వేసింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్ దక్కించుకుంది. రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. పలుమార్లు ఇద్దరి స్కోరు సమమయ్యాయి. స్కోరు 13–13 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో చోచువోంగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 7–5తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. ఆన్ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఏడుసార్లు ఆడిన సింధు ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఆన్ సె యంగ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది.
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–12తో సియాంగ్ చియె చియు–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో రెన్ జియాంగ్ యు–జియె హావోనన్ (చైనా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు.