22 ఏళ్ల తర్వాత... | Indian womens team wins first match in Asia Cup Under 20 tournament | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తర్వాత...

Apr 9 2026 3:42 AM | Updated on Apr 9 2026 3:42 AM

Indian womens team wins first match in Asia Cup Under 20 tournament

ఆసియా కప్‌ అండర్‌–20 టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం

పాథుమ్‌ థాని (థాయ్‌లాండ్‌): ఆసియా కప్‌ మహిళల అండర్‌–20 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 3–1 గోల్స్‌ తేడాతో చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున శిబాని దేవి నోంగ్‌మెకాపమ్‌ (32వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... భూమిక దేవి ఖుముక్‌చామ్‌ (26వ నిమిషంలో) ఒక గోల్‌ చేసింది. 

చైనీస్‌ తైపీ తరఫున సబ్‌స్టిట్యూట్‌ కావో సిన్‌ (90+3వ నిమిషంలో) ఏకైక గోల్‌ నమోదు చేసింది. 2004 తర్వాత ఆసియా కప్‌ అండర్‌–20 మహిళల టోర్నీలో భారత జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘సి’లో భారత జట్టు తమ మూడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. 

మూడు గ్రూప్‌ల నుంచి టాప్‌–2లో నిలిచిన ఆరు జట్లతోపాటు మూడు గ్రూప్‌ల్లో మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటాయి. గ్రూప్‌ ‘బి’లో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే భారత జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించేది. అయితే జోర్డాన్‌పై ఉజ్బెకిస్తాన్‌ భారీ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడంతోపాటు భారత జట్టు నాకౌట్‌ దశకు చేరే అవకాశాలకు తెరదించింది.

Advertisement
 
Advertisement
Advertisement