‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత
మాలే (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 పురుషుల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్ జట్టుతో గురువారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున విశాల్ యాదవ్ (3వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (64వ, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు.
వరుసగా రెండో పరాజయంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, బంగ్లాదేశ్ చెరో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఏడుసార్లు ‘శాఫ్’ అండర్–20 చాంపియన్‌షిప్ జరగ్గా... భారత జట్టు నాలుగుసార్లు టైటిల్ సాధించింది. నేపాల్ రెండుసార్లు, బంగ్లాదేశ్ ఒకసారి టైటిల్ సొంతం చేసుకున్నాయి.


