బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత రెండో పతకాన్ని ఖరారు చేసుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చికిత–రజత్ చౌహాన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గురువారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్లో చికిత–రజత్ ద్వయం 157–153 పాయింట్ల తేడాతో విక్టోరియా లియాన్–బున్‌యోద్ మిర్జామెతోవ్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో ఫాతిన్ నూర్‌ఫతే–జువైదీ మజుకీ (మలేసియా) జంటతో చికిత–రజత్ ద్వయం తలపడుతుంది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో 159–155 పాయింట్ల తేడాతో వె ఆన్ కీ–జున్‌వెగువో (చైనీస్ తైపీ) జంటపై గెలుపొందింది. ఇప్పటికే కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో చికిత, రాజ్ కౌర్, తేజల్ సాల్వేలతో కూడిన భారత బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించింది.


