బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) దిగొచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సత్సంబంధాల కోసం ముందడుగు వేసింది. ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీబీ.. బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం.
దౌత్యపరమైన ఉద్రిక్తతలు
కాగా ఆది నుంచి బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొన్నినెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లా నేతలు ఈశాన్య భారతంపై అవాకులు, చెవాకులు పేలడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
బంగ్లాదేశ్ హైడ్రామా
ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ టూర్ నిరవధికంగా వాయిదాపడింది. ఈ క్రమంలో ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్‌కు రామని బంగ్లాదేశ్ హైడ్రామా చేసింది.
భద్రతా కారణాలు చూపుతూ తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బీసీబీ ఐసీసీ (ICC)ని కోరింది. ఇందుకు ఐసీసీ నిరాకరించడంతో.. తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. అంతేకాదు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
సత్సంబంధాలు కోరుకుంటున్నామని..
అయితే, కొత్త ప్రభుత్వం మాత్రం క్రికెట్ విషయంలో భారత్‌తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించింది. కానీ జియోస్టార్ రంగంలోకి దిగి.. బంగ్లా స్థానిక బ్రాడ్‌కాస్టర్ బాకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నందున కాంట్రాక్టు రద్దు చేసింది.
బీసీసీఐకి లేఖ
ఈ నేపథ్యంలో తాజాగా బీసీబీ మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. దైనిక్‌జాగరణ్ కథనం ప్రకారం.. బీసీబీ బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు టీమిండియాను తమ దేశానికి పంపాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే క్రమంలోనే బీసీబీ ఈమేరకు దిగివచ్చినట్లు తెలుస్తోంది.
అదే జరిగితే..
కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2027 ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు రాకుండా ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్‌కు టీమిండియా ఈ విషయంలో షాకిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు గనుక ఆసియా కప్ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లకపోతే.. వేదికను శ్రీలంక లేదంటే యూఏఈకి మార్చడం లాంఛనమే అవుతుంది.
అదే జరిగితే బంగ్లాదేశ్ ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా బీసీబీ బీసీసీఐకి లేఖ రాసిన విషయాన్ని బంగ్లాదేశ్ బోర్డు అధికారి ఒకరు ధ్రువీకరించారు. రొటీన్ ప్రాసెస్‌లో భాగంగానే తాము ఈ పని చేసినట్లు వెల్లడించారు.
చదవండి: లీటర్ పెట్రోల్ ధర రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!


