లీటర్‌ పెట్రోల్‌ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే! | Fans Lambasted Shahid Afridi Appeal Petrol Price In Pak Soars To PKR 458 | Sakshi
Sakshi News home page

లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!

Apr 3 2026 3:20 PM | Updated on Apr 3 2026 3:42 PM

Fans Lambasted Shahid Afridi Appeal Petrol Price In Pak Soars To PKR 458

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్‌ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.

లీటర్‌ పెట్రోల్‌ ధర  రూ. 458
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్‌ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్‌ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్‌ మాలిక్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.

మన పరిస్థితి మెరుగ్గా ఉంది
ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్‌ ఆఫ్రిది. 

ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్‌పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. 

ప్రభుత్వం చెప్పినట్లే  నడుచుకోవాలి
ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే  నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. 

దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్‌ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.

చదవండి: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement