ముంబై ఇండియన్స్‌కు శుభవార్త | IPL 2026 MI vs DC: Mitchell Santner boost for Mumbai Indians | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌కు శుభవార్త

Apr 3 2026 1:21 PM | Updated on Apr 3 2026 1:28 PM

IPL 2026 MI vs DC: Mitchell Santner boost for Mumbai Indians

ఐపీఎల్‌-2026లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తమ ఆరంభ మ్యాచ్‌ ఆడిన హార్దిక్‌ సేన.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సత్తా చాటింది.

ఓ శుభవార్త 
ఈ క్రమంలో తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం నాటి ఈ మ్యాచ్‌కు అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఓ శుభవార్త అందింది.

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ గురువారం ముంబై జట్టుతో చేరాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉండనున్నాడు. కాగా భారత్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సాంట్నర్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాతో ఫైనల్లో కివీస్‌ ఓడిపోవడంతో అతడు రన్నరప్‌ జట్టు కెప్టెన్‌గా మిగిలిపోయాడు.

ఐదు సీజన్ల పాటు
ఇదిలా ఉంటే.. 2019లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన మిచెల్‌ సాంట్నర్‌.. ఐదు సీజన్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగాడు. అయితే, 2025 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలించుకోగా.. ముంబై ఇండియన్స్‌ రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఇక తుదిజట్టులో సాంట్నర్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో చోటు దక్కడం కష్టమే అయినా.. ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మంచి బ్యాకప్‌ ఆప్షన్‌గా పనిచేస్తాడు. 

కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో సాంట్నర్‌ 31 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌కు చెందిన దాదాపు అందరు ప్లేయర్లు జట్టుతో చేరారు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ విల్‌జాక్స్‌ ఒక్కడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు.

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్‌ జట్టు
అల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌, క్వింటన్‌ డి కాక్‌ , మయాంక్‌ రావత్‌, అథర్వ అంకోలేకర్‌, మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ , డానిశ్‌ మాలేవర్‌.

చదవండి: IPL 2026: ‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

Advertisement
 
Advertisement
Advertisement