‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం! | SRH All-Rounder NitishKumar Reddy Comments-Match Won Vs KKR | Sakshi
Sakshi News home page

IPL 2026: ‘నేనైతే ఫుల్‌ హ్యాపీ’.. తెలుగు క్రికెటర్‌ భావోద్వేగం!

Apr 3 2026 9:28 AM | Updated on Apr 3 2026 11:23 AM

SRH All-Rounder NitishKumar Reddy Comments-Match Won Vs KKR

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ గురువారం కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో బోణీ చేసింది. తెలుగు కుర్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి తనకున్న ఆల్‌రౌండర్ ట్యాగ్‌కు న్యాయం చేస్తూ మొదట బ్యాట్‌తో, ఆపై బంతితో మెరిసి జట్టు విజయంలో భాగం కావడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 

మ్యాచ్ ముగిసిన అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్‌. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగాను. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. 

గత సీజన్ నేను అనుకున్న ప్లాన్ ప్రకారం సాగలేదు. ఆ సీజన్‌లో నేను గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోయాయి. అయితే ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందు నా బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాను. నేను పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. 

కేకేఆర్‌తో మ్యాచ్‌లో నితీశ్‌కుమార్ మొదట బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 39 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 200 దాటడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రింకూ సింగ్‌, అనుకుల్‌రాయ్‌లను ఔట్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు బ్రేక్ అందించాడు. 

చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement