30 ఏళ్ల తర్వాత తొలి విజయం.. | Indian Men Football Team Won 2-1 Vs Hong Kong | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల తర్వాత తొలి విజయం..

Apr 1 2026 1:51 PM | Updated on Apr 1 2026 2:02 PM

Indian Men Football Team Won 2-1 Vs Hong Kong

కొచ్చి: నామమాత్రమైన మ్యాచ్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు మెరిసింది. హాంకాంగ్‌ జట్టుతో మంగళవారం జరిగిన ఆసియా కప్‌ 2027 క్వాలిఫయింగ్‌ టోర్నీ చివరి మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ గ్రూప్‌ ‘సి’లో భారత్‌ ఐదు పాయింట్లతో చివరిదైన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 

భారత్, బంగ్లాదేశ్‌ ఐదు పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన గోల్స్‌ సగటుతో బంగ్లాదేశ్‌కు మూడో స్థానం, భారత్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. హాంకాంగ్‌ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా... సింగపూర్‌ 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించింది.

గతేడాది భారత పౌరసత్వాన్ని తీసుకున్న ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్‌ రియాన్‌ విలియమ్స్‌ తొలిసారి టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 32 ఏళ్ల విలియమ్స్‌ నాలుగో నిమిషంలోనే భారత్‌కు తొలి గోల్‌ అందించాడు. 50వ నిమిషంలో ఆకాశ్‌ మిశ్రా గోల్‌తో భారత్‌ 2–0తో ముందంజ వేసింది. 65వ నిమిషంలో ఎవర్టన్‌ కమార్గో గోల్‌తో హాంకాంగ్‌ ఖాతా తెరిచింది. అయితే తదుపరి 35 నిమిషాలు హాంకాంగ్‌ ఆటగాళ్లను భారత్‌ నిలువరించి ఈ టోర్నీని గెలుపుతో ముగించడంలో విజయవంతమైంది. కాగా కొచ్చి మైదానంలో భారత ఫుట్‌బాల్‌ టీం 30 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకోవడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement