
న్యూఢిల్లీ: డోపింగ్ వ్యవహారంలో పట్టుబడిన పలువురు ఆటగాళ్లపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కొరడా ఝళిపించింది. వీరందరినీ మూడేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆటగాళ్లపై గతంలోనే నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే ఈ ప్రకటన వచ్చిన 20 రోజుల్లోగా తమ తప్పును అంగీకరిస్తూ ముందుకు రావటంతో ‘నాడా’ చట్టంలోని నిబంధనల ప్రకారం ఒక ఏడాది నిషేధం తగ్గింది.
ఈ ఆటగాళ్లంతా స్టనొజొలోల్, మెటాండినోన్, నొరాన్‌డ్రోస్టెరాన్, మెఫంటర్‌మైన్‌వంటి నిషేధిక ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లుగా పరీక్షల్లో తేలింది. నిషేధానికి గురైన ఆటగాళ్ల జాబితాలో ముగ్గురు అథ్లెట్లు ఉన్నారు. ఈ ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో డిస్కస్ త్రోలో స్వర్ణం సాధించిన గగన్ దీప్ సింగ్‌పై వేటు పడింది. పోటీల్లో అతను సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
స్వర్ణం కూడా వెనక్కి
ఇక గగన్‌నుంచి స్వర్ణం కూడా వెనక్కి తీసుకోనుండగా... రెండో స్థానంలో నిలిచిన నిర్భయ్ సింగ్ (హరియాణా)కు ఇప్పుడు పసిడి పతకం దక్కుతుంది. మరో ఇద్దరు అథ్లెట్లు సచిన్ కుమార్, జైను కుమార్ కూడా నిషేధానికి గురయ్యారు.
మోనికా చౌదరి, నందని వత్స్ (జూడో), ఉమేశ్‌పాల్ సింగ్, శామ్యూల్ వన్‌లల్‌తన్‌పుయ (పారా పవర్‌లిఫ్టింగ్), కవీందర్ (వెయిట్‌లిఫ్టింగ్), శుభమ్ కుమార్ (కబడ్డీ), ముగలి శర్మ (రెజ్లింగ్), అమన్, రాహుల్ తోమర్ (వుషు)పై కూడా ‘నాడా’ మూడేళ్ల వేటు వేసింది.