తొలిసారిగా 9వ తరగతి జవాబు పత్రాలకు ‘క్రాస్ వాల్యుయేషన్’
● మండలానికి ఒక మూల్యాంకన కేంద్రం ● 208 మంది ఉపాధ్యాయుల నియామకం ● ‘మా పిల్లల పేపర్లు కాస్త చూడండి’.. అంటూ ఫోన్లు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను వెలికితీసేందుకు విద్యాశాఖ చేపట్టిన కొత్త ప్రయోగం ఇప్పుడు
ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇప్పటివరకు తమ పాఠశాల విద్యార్థుల జవాబు పత్రాలను ఉపాధ్యాయులే దిద్దుకునే సౌలభ్యం ఉండగా.. ఇకపై ఆ విధానానికి విద్యాశాఖ స్వస్తి పలికింది. నిష్పక్షపాతంగా మార్కుల అంచనా, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ‘క్రాస్ వాల్యుయేషన్’ (ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం) విధానాన్ని విద్యాశాఖ తెరపైకి తెచ్చింది. ఈ విద్యా
సంవత్సరం నుంచి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న సమ్మేటివ్
అసెస్మెంట్–1 ( ఎస్ఏ–1) పరీక్షల్లో 9వ తరగతి జవాబు పత్రాలను మండల
కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లోనే మూల్యాంకనం చేస్తున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలో 261 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో 8,916 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఎస్ఏ–1 పరీక్షలు ఈ నెల 1 నుంచి ప్రారంభం కాగా 9వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలోని 26 మండలాల్లో 26 మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయగా పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 5వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇందు కోసం 208 మంది ఉపాధ్యాయులను, 43 మంది డీటీపీ ఆపరేటర్లను నియమించారు.
మార్కులపై ఆందోళన..
పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు ఎన్ని మార్కు లు వస్తాయోనని ఆందోళన చెందడం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. తమ బోధనకు విద్యార్థులు సాధించిన మార్కులు ఎలా ఉంటాయోనని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు జవాబు పత్రాలను దిద్దుతుండటంతో విద్యార్థుల ప్రతిభతోపాటు తమ బోధనా ఫలితాలపైనా స్పష్టత వస్తుందనే చర్చ జరుగుతోంది. పాఠశాలలో పరీక్ష రాసే సమయంలో బాగా రాయాలని విద్యార్థులను ఆయా సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలని ఉద్దేశంతో కొన్ని చోట్ల కాపియింగ్ను సైతం ప్రోత్సహిస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలో చర్చ సాగుతోంది.
కాస్త చూడండి.. అంటూ..
మూల్యాంకనం ప్రారంభమైన నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు తమ విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దుతున్న ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు ఫోన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమ విద్యార్థులకు మార్కులు ఎలా వస్తున్నాయో ఆరా తీయడంతోపాటు.. కాస్త చూసి మార్కులు వేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రాస్ వాల్యుయేషన్ ఉద్దేశం నెరవేరాలంటే ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం మూల్యాంకనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


