వర్గల్(గజ్వేల్): ఆధ్యాత్మికత నెలవు వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం దసరాశరన్నవరాత్రోత్సవ శోభతో అలరారుతోంది. ఉత్సవాల్లో నాలుగోరోజు బుధవారం అమ్మవారు సృష్టి, స్థితి లయకారిణి లలితాపరమేశ్వరిదేవిగా భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆదిశక్తిని స్మరిస్తూ చతుషష్ట్యుపచార, రాజోపచార పూజలు, సప్తశతి పారాయణం, చండీ హవనం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు బుధవారం అమ్మవారు శాకాంబరీ స్వరూపిణీ మాతగా దర్శనమిచ్చారు. క్షేత్రం నిర్వాహకుడు చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.


