అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ హైమావతి
జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
సిద్దిపేటజోన్: బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లలో రాజీ పడొద్దని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు, ఎర్ర చెరువు, నర్సాపురం, రంగధాంపల్లి చెరువు, మచ్చవాని కుంట తదితర ప్రాంతాల్లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా చెరువుల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. బతుక మ్మ పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కోమటి చెరువు వద్ద పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వహణ ఇన్చార్జి, పర్యాటక శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. సద్దుల బతుకమ్మ వరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. చెరువుల వద్ద ప్రమాదాల నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. చెరువుల్లో రోజువారీ బతుకమ్మ పూలను తొలగించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన చోట బారికేడ్లు, లైటింగ్, వైద్యసదుపాయాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండాలన్నారు.
ఓటరు నమోదుకు మరో అవకాశం
సిద్దిపేటరూరల్: వలసవెళ్లిన వారు, 18 ఏళ్లు పైబడిన వారికి ఓటరు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఈనెల 15, 16వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నమోదు చేసుకున్న వారి వివరాలను నవంబర్ 9న ప్రచురించే ఓటరు ముసాయిదాలో చేర్చనున్నట్లు తెలిపారు. బీఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు.


