3,836 ఇందిరమ్మ ఇళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

3,836 ఇందిరమ్మ ఇళ్లు రద్దు

Feb 20 2026 11:07 AM | Updated on Feb 20 2026 11:07 AM

3,836 ఇందిరమ్మ ఇళ్లు రద్దు

3,836 ఇందిరమ్మ ఇళ్లు రద్దు

పెరిగిన మెటీరియల్‌ ధరలు

నిర్మించుకునేందుకు

ముందుకురాని లబ్ధిదారులు

జిల్లా వ్యాప్తంగా 13,067 ఇళ్లు మంజూరు

ఇప్పటి వరకు ముగ్గు పోసింది 9,281 మందే

సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు లబ్ధిదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోవని.. మరో వైపు నిర్మాణం కొలతల నిబంధనలతో ముందుకు రావడం లేదని తెలుస్తోంది. నిర్మించినా బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తుండటం మరో కారణం. జిల్లా వ్యాప్తంగా 13,067 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 9,231 మందే ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఇంకా 3,836 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయకపోవడంతో వాటిని రద్దు చేశారు. వాటిని మరికొందరికి మంజూరు చేసేందుకు ప్రతిపాదన సేకరిస్తున్నారు.

ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన వారికి సైతం బిల్లులు వెంటనే చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల పనుల పురోగతి ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నా సకాలంలో అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. వివిధ దశల్లో 7,636 నిర్మాణం జరిగిన వాటికి రూ.212.84కోట్లను చెల్లించారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి ప్రభుత్వం రూ.5లక్షల సాయం అందిస్తోంది. సిమెంట్‌, ఐరన్‌, ఇటుకలు, భవన నిర్మాణ కూలీ డబ్బులు విపరీతంగా పెరగడంతో దాదాపు రూ.12లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో పేదల ఇంటి నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ రుణాలు అందించి వెసులుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇల్లు ఒకరిది..

బిల్లు మరొకరికి

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లింపుల్లో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని.. ఇంటింటి సర్వేలో అధికారులకు వివరాలన్నీ సమర్పించి.. తీరా ప్రొసీడింగ్‌ పత్రం వచ్చి ఇంటి నిర్మాణం కొనసాగుతున్న వేళ బిల్లులు మాత్రం ఇతరుల ఖాతాల్లో జమ కావడంతో లబ్ధిదారులు కంగుతింటున్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం వెల్కటూరు గ్రామంలో మంచాల అరుణ, భర్త పేరు యాదగిరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. గతేడాది జూలై 28న ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోశారు. సెప్టెంబర్‌ 8న బేస్మెంట్‌ వరకు నిర్మాణం కాగానే స్థానిక అధికారులు ఫొటో తీసుకుని ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. మొదటి బిల్లు రావడం లేదని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదే గ్రామానికి చెందిన మంచాల అరుణ భర్త పేరు కనకయ్యకు చెందిన బ్యాంక్‌ ఖాతాలో రూ.లక్ష జమ అయింది. ఇద్దరికి ఒకే ఆధార్‌ నంబర్‌ను అధికారులు నమోదు చేయడంతో మరొకరి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. అధికారులు చేసిన తప్పిదానికి బిల్లు రాకుండా పోయింది. 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలో నిలిపివేయవద్దని అప్పు తెచ్చి నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో సైతం రెండు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఆధార్‌ నంబర్లు సరి చేసి ఇందిరమ్మ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

ముగ్గుపోయని వాటిని రద్దు చేశాం

ఇందిరమ్మ ఇళ్లు మంజూరై 45 రోజులు అయినప్పటికీ నిర్మాణం కోసం ముగ్గు పోయని వారి వివరాలను ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా వివరాలు తెప్పించి రద్దు చేశాం. వాటి స్థానంలో కొత్తగా మంజూరు చేసేందుకు వివరాలు తెప్పించుకుంటున్నాం. అలాగే ఇంటి నిర్మాణం చేసిన వారికి కాకుండా మరొకరికి బిల్లు పడిన విషయం మాదృష్టికి వచ్చింది. దానిని త్వరలో పరిష్కరిస్తాం.

–పవన్‌కుమార్‌, పీడీ, హౌసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement