దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌రనగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతికి, అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఖాళీలు ఉన్న సీట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల్గిన విద్యార్థులు ఈ నెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు దగ్గరలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
హుస్నాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు ఆయేషా మస్రత్ ఖానమ్ పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్. ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
విద్యార్థులపై
ప్రత్యేక శ్రద్ధ చూపండి
దుబ్బాకటౌన్: ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఉప్పరపల్లి, గువ్వలేగి, గోవిందాపూర్, పోసానిపల్లి,గొడుగుపల్లి, మల్లేశంపల్లి పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషనల్ లీటరసీ స్టడీ జాతీయస్థాయి సర్వేకు సంబంధించిన పరీక్ష కోసం విద్యార్థులను సంసిద్ధం చేయాలన్నారు. విద్యార్థులతో ఆంగ్లం పాఠాలు చదివించి గణితంలో సమస్యలు చేయించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులందరికీ మాదిరి పరీక్షలు నిర్వహిస్తూ జాతీయస్థాయి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కనకరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌ను జయిద్దాం
● ప్రారంభ దశలో గుర్తిస్తేనే మేలు
● జిల్లా న్యాయమూర్తి సంతోశ్‌కుమార్
సిద్దిపేటకమాన్: క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని జయించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సంతోశ్‌కుమార్ అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్యాన్సర్‌లో 200 రకాలు ఉంటాయని తెలిపారు. క్యాన్సర్ వచ్చినపుడు మనిషి మానసికంగా, దృఢంగా ఉన్నప్పుడే వ్యాధిని జయించవచ్చన్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ చిన్న నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదని, మహిళలు ముందు వారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బావుంటుందన్నారు. గుట్కా, సిగరెట్టు, తంబాకు, వాడే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, సీఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సదానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
దరఖాస్తుల ఆహ్వానం


