ఇవేం వంటలు?
మర్కూక్ (గజ్వేల్): ‘ఇవేం వంటకాలు.. మీరైతే ఇలానే తింటారా? విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా?.. మెనూ ఎందుకు అమలు చేయడంలేదు’ అని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే నూతనంగా నిర్మిస్తున్న గణేశ్‌పల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మర్కూక్ కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొలత ప్రకారం ఇచ్చిన కూరగాయలు చేసిన వంటకు పొంతనే లేదని ఎస్‌ఓ భాగ్యలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. రిజిస్టర్లో రాయకుండా ఇష్టానుసారంగా సరుకులు అందిస్తారా? అని మండిపడ్డారు. ఇష్టానుసారంగా పిల్లలకు భోజనం వడ్డిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట చేయలేదని ఎస్‌ఓ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓ శ్రీనివాస్‌రెడ్డిని ఫోన్‌లో ఆదేశించారు. తరుచూ కేజీబీవీని సందర్శించాలని ఏంఈఓ వెంకట్‌రాములుకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులను సందర్శించారు. మెరుగైన వైద్యం అందించి మెడికల్ ఆఫీసర్ నుంచి కిందిస్థాయి ఆఫీసర్ వరకు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. గణేశ్‌పల్లిలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి
విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా
మెనూ ఎందుకు పాటించడంలేదు
కలెక్టర్ హైమావతి ఫైర్
ఎస్‌ఓ భాగ్యలక్ష్మిపై
చర్య తీసుకోవాలంటూ ఆదేశాలు


