వీధుల్లో చీకట్లు..వీడని ఇక్కట్లు
వీధి దీపాల టెండర్లు జరగక.. కొత్తవి ఏర్పాటు చేయడంలో జాప్యం బాలికల వసతి గృహాల వద్ద కారుచీకట్లు రోడ్లపై తరుచూ ప్రమాదాలు దృష్టిసారించని అధికారులు
జిల్లాలోని పట్టణాల్లో జనం పాట్లు
మున్సిపాలిటీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రి అయిందంటే చాలు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వీధి దీపాలు ఫెయిలైతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో పట్టణాలకు వీధి దీపాలను సరఫరా చేసిన సంస్థ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో కొత్త సంస్థలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.
గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ప్రస్తుతం వీధి దీపాల సమస్య తీవ్రంగా మారింది. గతంలో ఎక్కడైనా లైట్లు ఫెయిలైతే వెంటనే వాటి స్థానంలో కొత్తవి బిగించేవారు. కానీ నేడు నెలలు గడిచినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వైశాల్యం ప్రస్తుతం 43 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. పట్టణంలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ విలీనం కావడంతో వైశాల్యం గణనీయంగా పెరగడానికి కారణమైంది. ఇకపోతే ఈ పట్టణానికి కంఠహారంగా 24కిలోమీటర్ల మేర రింగు రోడ్డు ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, సంగాపూర్, రాజిరెడ్డిపల్లి, ఆర్‌అండ్‌ఆర్ కాలనీతోపాటు రింగు రోడ్డు కలుపుకొని ఇక్కడ 7126 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఏటా రూ.20లక్షలకుపైగానే ఖర్చవుతోంది. ఇది సాధారణ నిర్వహణ మాత్రమే. ఒకవేళ కొత్త స్తంభాలు, వైరు వేయాలనుకున్నా బడ్జెట్ పెరిగే అవకాశముంటుంది.
ఏడాదిన్నర క్రితం వరకు వీధి దీపాల నిర్వహణ సజావుగానే సాగింది. గతంలో పనిచేసిన ఈఎస్‌ఎల్ సంస్థ టెండర్ రద్దు కావడంతో కొత్తగా మున్సిపాలిటీల స్థాయిలో టెండర్‌లు నిర్వహించుకొని వీధి దీపాలు వేయించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో టెండర్లు పిలువగా..ఓ వ్యక్తి టెండర్‌ను దక్కించుకున్నారు. కానీ ఇప్పటివరకు అగ్రిమెంట్ చేసుకోలేదు. పనులు మొదలు పెట్టలేదు. ఈక్రమంలోనే మూడుసార్లు నోటీసులు ఇచ్చినా...ఫలితం లేకుండా పోయింది.
ఒక్క గజ్వేల్‌లోనే కాదు...సిద్దిపేట మున్సిపాలిటీలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ కొంత కాలంగా ప్రధాన ప్రదేశాల్లో చీకట్లు ముసురుకొని జనం ఇబ్బందిపడుతున్నారు.
బాలికలకు ఇబ్బందులు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వీధిలైట్లు సక్రమంగా వెలగడంలేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి గజ్వేల్‌లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్, రింగు రోడ్డు వద్ద ఈ సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే పరిష్కరించాలి.
– బారు అరవింద్, గజ్వేల్
సమస్యను పరిష్కరిస్తాం
మున్సిపాలిటీలో వీధి లైట్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. టెండర్ దక్కించుకున్న వ్యక్తి అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అతనికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికీ రాకపోతే ఇతర మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్,
గజ్వేల్–ప్రజ్ఞాపూర్
పలు ప్రధాన కాలనీల్లో..
పట్టణంలోని పలు ప్రధాన కాలనీల్లో, బాలికల వసతి గృహాల వద్ద, రింగు రోడ్డుపై లైట్లు ఫెయిలై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాత్రివేళల్లో దొంగతనలకు ఆస్కారం కలుగుతుండగా, అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మరోవైపు రోడ్లపై లైటింగ్ లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి రూ.341కోట్ల వ్యయంతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఎక్కడికక్కడా సర్కిళ్లు, అందమైన గార్డెనింగ్‌తో తీర్చిదిద్దారు. కానీ నేడు లైట్లు వెలగక రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది.
వీధుల్లో చీకట్లు..వీడని ఇక్కట్లు
వీధుల్లో చీకట్లు..వీడని ఇక్కట్లు
వీధుల్లో చీకట్లు..వీడని ఇక్కట్లు


