పాతాళ గంగ.. ౖపైపెకి రావంగ
గతేడాది అక్టోబర్ కంటే 1.81 మీటర్లు పెరుగుదల జిల్లావ్యాప్తంగా సగటున 6.43 మీటర్ల లోతులోనే జలాలు ఇక యాసంగి పంటలకు తప్పిన నీటి తిప్పలు
పాతాళ గంగ ౖపైపెకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరగడంతో ఈసారి యాసంగిలో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో యాసంగికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
– సాక్షి, సిద్దిపేట
గతేడాది అక్టోబర్‌లో జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు 8.24 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 6.43 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 76% అధికంగా వర్షం కురవడంతో భూగర్భ జలాలు ఉబికివచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు జలకళ సంతరించుకున్నాయి.
గతేడాది అక్టోబర్ నాటికంటే ఈసారి అదేనెలలో 1.81మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో గతంలో పోల్చితే భూగర్భ జలాలు పైకి వచ్చాయి. అత్యధికంగా మర్కూక్‌లో 10.11మీటర్లు, రాయపోలు మండలంలో 7.69 మీటర్లు, దౌల్తాబాద్‌లో 4.63, తొగుటలో 4.23, పెరిగాయి. జిల్లాలో అత్యల్ప లోతులో వర్గల్ మండలంలో 1.81మీటర్లలో భూగర్భ జలాలు, అత్యధికంగా 17.51 మీటర్ల లోతులో దౌల్తాబాద్ మండలంలో భూగర్భ జలాలున్నాయి.
గతేడాది కంటే ఈ ఏడాది ఐదు మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. చేర్యాలలో –4.01 మీటర్లు, బెజ్జంకి మండలంలో –0.73, కోహెడలో –1.21, కొండపాకలో –0.94, మద్దూరులో –0.20 మీటర్ల మేర భూగర్భ జలాలు కిందకు వెళ్లాయి.
జిల్లావ్యాప్తంగా సగటున సాధారణ వర్షపాతం 699.4మిల్లీ మీటర్లు కాగా ఇప్పటివరకు 1229.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 76% అధికంగా వర్షం కురిసింది. దీంతో చెరువులు అలుగులు పోశాయి. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లకు వరద నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి.
సాధారణం కంటే 76% అధికంగా వర్షపాతం నమోదు
భూగర్భ జలాలు పెరిగాయి...
ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. యాసంగి పంటకు భూగర్భ జలాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
–నాగరాజు, ఏడీ, భూగర్భ జలశాఖ
యాసంగి పంటలకు ఢోకా లేనట్టే
జిల్లాలో పెరిగిన భూగర్భ నీటి మట్టంతో వ్యవసాయ బోర్లు, బావుల పరిధిలో సాగుకు మరింత ఉపయోగకరంగా మారనుంది. వ్యవసాయ బావుల వద్ద కూరగాయలు, వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసేందుకు దోహదపడనుంది. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో యాసంగి సాగుకు ఇబ్బంది లేదు. గతంలో వదిలేసిన బోర్లలో కూడా నీరు ఉబికి వస్తుండటంతో రైతులు మోటార్లు బిగించుకోనున్నారు. దీంతో యాసంగిలో సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది.
పాతాళ గంగ.. ౖపైపెకి రావంగ


