బెజ్జంకిలో పత్తి దగ్ధం
రూ. 20 లక్షల వరకు నష్టం
బెజ్జంకి(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అగ్నికి ఆహుతైంది. రైతుకు తీవ్ర ఆవేదన మిగిల్చిన ఘటన శనివారం బెజ్జంకిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతు ఐలయ్య తనకున్న 12 ఎకరాలతో పాటు 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని ఇంటి వద్ద 350 క్వింటాళ్ల పత్తిని ఆరబెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి దగ్ధమైంది. స్థానికులు ట్యాంకర్ల ద్వారా తెచ్చిన నీటిని పిచికారీ చేసినా మంటలు అదుపులోకి రాలేదు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సిద్దిపేట నుంచి ఫైరింజన్ తెప్పించడంతో ఎట్టకేలకు మంటలు ఆర్పినప్పటికీ సుమారు 300 క్వింటాళ్లకు పైగా కాలిపోగా మిగితా పత్తి నల్లబడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం రోదిస్తుండటం స్థానికులను కలిచి వేసింది. ఫైరింజిన్ సకాలంలో వస్తే ఇంత నష్టం జరిగేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు.


