కామ్రేడ్స్‌ల కయ్యం!
హుస్నాబాద్: సీపీఐ నాయకుల వర్గ పోరుతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ హాలులో శనివారం రెండు వర్గాల నాయకులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ మూడు మండలాల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వీరికి పోటీగా అదే హాలులో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ జాగిర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ అధ్యక్షతన నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఒకే సమయంలో రెండు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఆర్ధం కాని పరిస్ధి తి. రెండు వర్గాల పోటాపోటీ నినాదాలతో కార్యాలయం మారుమోగింది.
ఈ వర్గ పోరు ఇప్పటిది కాదు
శాసన సభ ఎన్నికల తర్వాత నుంచి మొదలైన వర్గ పోరు దాదాపు రెండేళ్ల నుంచి నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చీలికలకు దారి తీసింది. అప్పటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్ మధ్య ఉన్న విభేధాలతో జిల్లాలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో హుస్నాబాద్ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించుకునేందుకు పవన్ వస్తే చాడ వర్గీయులు తాళం వేశారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావుకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆయన రెండు వర్గాల మధ్య సమన్వయం చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు సమన్వయంతో ఉన్నట్లు సమావేశాలు నిర్వహించినా.. లోపల మాత్రం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
నియోజకవర్గ కమిటీ జిల్లా పార్టీ గుర్తించదు
జిల్లా పార్టీకి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎంపిక చేసిన సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కమిటీని తాము గుర్తించడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఎంపికలో పాల్గొ న్న జిల్లా కమిటీ సభ్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నవంబరు 17, 18వ తేదీలలో జరిగే సీపీఐ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


