అన్నదాత... అరిగోస
అడపాదడపా వర్షాలు
రైతుకు తప్పని తేమ తిప్పలు
కొనేందుకు నిర్వాహకుల సవాలక్ష కొర్రీలు
కోరబండి, జల్లి పేరిట జేబుకు చిల్లు
యార్డులో వేలాది ధాన్యం బస్తాలు
రోజులకొద్దీ అన్నదాతల పడిగాపులు
సిద్దిపేటజోన్: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా మారింది. అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. తేమ, పొల్లు, చిన్న గింజ పేరిట పంటను కొనేందుకు నిర్వాహకులు సవాలక్ష కొర్రీ లు పెడుతున్నారు. మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేయ డంతో కురుస్తున్న అకాలవర్షాలతో రైతుల పంట తడిసి ముద్దయిపోతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పంటకు మద్దతు ధర కోసం అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తుంది. కొనుగోలు ప్రక్రియ జాప్యంతో రైతులు పడిగాపులు కాయడం, అకాల వర్షాలతో పంట తడవడం, తేమ శాతం అనుగుణంగా లేని క్రమంలో అరబెట్టడం, మళ్లీ వర్షం కారణంగా తడవడం, తేమ శాతం మళ్లీ పెరగడం ఇది నిత్యకృత్యంగా మారుతోంది. సిద్దిపేట యార్డులో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 25 వేల ధాన్యం బస్తాలు తూకం కోసం సిద్ధంగా ఉన్నాయి.
కొర్రీల కిరికిరి
ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తేమ శాతం, పొల్లు, గింజ పరిమాణం పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిబంధనల మేరకు 14తేమ శాతం ఉన్న మొక్కజొన్న క్వింటాలుకు రూ 2,400 మద్దతు ధర, అదేవిధంగా 17 తేమ శాతం ఉన్న ధాన్యం క్వింటాలుకు రూ 2,389 మద్దతు ధర ప్రకటించారు. వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనితో దాన్ని ఆరపెట్టడానికి అన్నదాతలు రోజులకొద్దీ యార్డులో పడిగాపులు కాయాల్సి వస్తుంది. కనీసం 6 రోజుల నుంచి 20 రోజుల వరకు ఒక్క తేమ శాతం తక్కువగా ఉండేందుకు రైతులు యార్డులో ఉండే పరిస్థితి నెలకొంది.
ఇరవై రోజులు అయింది..
మాది సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సన్ పల్లి. 10 ట్రాక్టర్‌లో వడ్లు తెచ్చిన. అకాల వర్షానికి తడిసింది. ప్రతి రోజు ఇక్కడే అరబోస్తున్న, తేమ శాతం ఎక్కువ, తక్కువ అవుతుంది. 20నుంచి ఇప్పుడు 18 వచ్చింది. ఆర బెట్టేందుకు చాలా కష్టంగా ఉంది. సార్లు వస్తున్నారు.. చూసి పోతున్నారు. ఏమి చేయాలో అర్థం అయితలేదు. కోరబండికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
–కనకవ్వ
గోస పడుతున్నాం..
రెక్కలు ముక్కలు చేసి కష్టపడి పంట కాపాడుకున్నాం. గింజలు అమ్మితే పైసలు వస్తాయని ఇక్కడికి వస్తే సార్లు తేమ సరిగ్గా లేదు అంటున్నారు. 13 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇల్లు, పిల్లలు అక్కడ మా కష్టాలు ఎవ్వరికీ రావొద్దు. కోర బండికి, జల్లికి ఇప్పటి వరకు రూ 5,000 ఖర్చు అయింది.
–పున్నమ్మ (నర్సాపురం)


