రైతన్నకు తీరని నష్టం
5.20 ఎకరాల్లో సాగు..
ఇంకా నేలవాలిన పంటలే దర్శనం
● భారీ వర్షాలతో కోలుకోని అన్నదాతలు ● ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు
వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,20,672 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3.63 లక్షల ఎకరాల్లో వరి, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలతో పాటు కంది, పెసర, ఇతర పంట లు సాగయ్యాయి. జిల్లాలో 3,916 మంది రైతులకు చెందిన 5,483 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసా యాధికారుల అంచనా ఉండగా ఇంతకు రెట్టింపు గానే నష్టం వాటిల్లినట్లు కనబడుతోంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్లుగారి నర్సింహారెడ్డి. దుబ్బాకకు చెందిన ఇతను వానాకాలంలో తన సొంత పొలంతోపాటు కౌలుకు తీసుకొని మొత్తం 20 ఎకరాల్లో వరి వేశారు. రూ.4 లక్షలకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. తీరాపంట చేతికొచ్చేవేళ వర్షాలు దంచికొట్టడంతో పొలంలోనే పంటంతా నేలవాలింది. పైగా గొలలు మొలకలొస్తూ తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. పంటంతా నేలవాలడంతో కోసేందుకు సైతం వీలుకావడంలేదు. సగం పంటైనా దక్కుతుందో లేదో అంటూ రైతు ఆవేదన చెందుతున్నారు. ఈ ఒక్క రైతుదే కాదు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది.
దుబ్బాక: రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తయారైంది. పగబట్టినట్లుగా వరణుడు రైతులను కోలుకోలేకుండా చేశాడు. సరిగ్గా పంటలు చేతికొస్తాయనుకున్న దశలోనే భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. వరిపంటలు కోసిన రైతులు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్లపై ఆరబెట్టగా వానలు దంచికొట్టడంతో ధాన్యం తడిసిముద్దవడం, కొట్టుకుపోవడంతో తీరని నష్టం ఏర్పడింది. చాలా చోట్ల కోతకొచ్చిన వరిపంటలు పొల్లాల్లోనే నేలవాలి ఉన్నాయి. దీంతో కోసేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.
కన్నీటిపర్యంతం
ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని పండించిన పంటలు తీరా నోటికాడికొచ్చే సమయంలో నాశనం కావడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పంటల నష్టంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ప్రభుత్వమే సమగ్రంగా పంటల నష్టంపై సర్వే జరిపించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.
అధైర్యపడొద్దు
మోంథా తుపాన్‌తో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందిస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. –స్వరూపరాణి,
జిల్లా వ్యవసాయ అధికారి
రైతన్నకు తీరని నష్టం
రైతన్నకు తీరని నష్టం


