మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లం పాయసం తయారు చేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని తమ పిల్లాపాపలను చల్లంగా చూడలని వేడుకున్నారు.
చెత్త ఆటోలకు తుప్పు
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో చెత్తను వెంట వెంటనే తరలించడానికి ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత్ ఆటోలు అందజేశారు. ట్రాక్టర్లు వెళ్లలేని కానీలలో చెత్తను తీసుకెళ్లడానికి ఆటోలను కేటాయించారు. చాలా గ్రామాల్లో చెత్త ఆటోలను మూలన పడేశారు. అవి తుప్పు పట్టిపోతున్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చే ఆటోలకు ఈదుర్గతి పట్టడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘పద్యం’ చిరస్మరణీయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని, ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందని అవధాని గౌరిభట్ల రఘురామశర్మ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశపతి శ్రీనివాసశర్మ, రుక్మాభట్ల కొదండరామశర్మలు సంగీతంతో అలరించారు. అష్టావధానాన్ని డాక్టర్ గౌరిభట్ల రఘురామశర్మ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
తాగునీటి సరఫరాలో
నేడు అంతరాయం
సిద్దిపేటజోన్: లోయర్ మానేరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇల్లంతకుంట శివార్లలో పైపులైన్ లీకేజీ వల్ల అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తున్నారని, దీంతో 18, 19, 20, 21, 36వ వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. ఆయా వార్డుల ప్రజలు సహకరించాలని కోరారు.
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి


