డబుల్ బెడ్రూంలో గలీజ్ పనులు
● ఖాళీ గదుల్లో అసాంఘిక కార్యక్రమాలు ● జోరుగా గంజాయి, మద్యం సేవనం ● రోజూ కొత్త వ్యక్తుల సంచారం ● చోద్యం చూస్తున్న అధికారులు
డబుల్‌బెడ్రూం గృహాలు
దుబ్బాకరూరల్: పట్టణంలోని ఖాళీ డబుల్ బెడ్రూంల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి సేవించడమేకాకుండా ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. దుబ్బాకలో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. 900వందల వరకు ఇళ్లు ఉంటాయి. మూడేళ్ల క్రితం కొందరికి పంపిణీ చేశారు. సుమారు 800వందల ఇళ్లల్లో ప్రజలు తమ కుటుంబీకులతో ఉంటున్నారు. ఇందులోనూ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులే ఉండాలి. కానీ స్థానికేతరులే అధికంగా ఉంటున్నారు. కేటాయించని వాటిలోనూ కొందరు అక్రమంగా నివసిస్తున్నారు. కొంత మంది యువకులు మత్తు పదార్థాలు సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
ఇళ్ల సమీపంలోనే బెల్ట్ షాపు
డబుల్ బెడ్రూంల వద్ద బెల్ట్ షాపు ఉండడంతో విచ్చల విడిగా విక్రయాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలుదాటినా విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూంల్లో రోజూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పోలీస్‌స్టేషన్ వరకు వెళ్తున్నాయి. పోలీస్‌లు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారే తప్ప అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలేదు. మరోవైపు కొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఇవి ఆత్మహత్యలా? లేక హత్య లా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. డబుల్ బెడ్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారని స్థానికులు వాపోతున్నారు.
డబుల్ బెడ్రూంలో గలీజ్ పనులు
డబుల్ బెడ్రూంలో గలీజ్ పనులు


