
రోడ్డుపై బైఠాయించి నిరసన
చేర్యాల(సిద్దిపేట): యూరియా బస్తాల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న స్థానిక ఏఓపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు రోడ్డెక్కారు. మంగళవారం పట్టణంలోని బాలాజీ కళామందిర్ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఓ టోకెన్ జారీ చేసినా షాపుల నిర్వాహకులు యూరియా ఇవ్వడం లేదన్నారు. వచ్చిన బస్తాలకన్నా ఎక్కువ టోకెన్లు జారీ చేస్తూ రైతులను ఇబ్బందుల పాలుజేస్తున్నారన్నారు. రోజంతా లైన్‌లో నిలబడినా యూరియా అయిపోందంటూ పంపిస్తున్నారని వాపోయారు. మరోవైపు రాజకీయ నాయకులకు చాటుగా యూరియా బస్తాలు అందిస్తున్న ఏఓపై చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడీఏ రాధిక రైతులతో మాట్లాడారు. సమస్యపరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించారు.